Share News

సిగినాపల్లి రంగురాళ్ల క్వారీలో శాశ్వత బేస్‌ క్యాంప్‌

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:49 AM

పెదవలస రేంజ్‌ పరిధి సిగినాపల్లి రంగురాళ్ల క్వారీలో శాశ్వత బేస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశామని డివిజనల్‌ ఫారెస్టు అధికారి(డీఎఫ్‌వో) వైవీ నరసింహరావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సిగినాపల్లి రంగురాళ్ల క్వారీలో తవ్వకాలను కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సిగినాపల్లి రంగురాళ్ల క్వారీలో శాశ్వత బేస్‌ క్యాంప్‌
క్వారీ వద్ద పహారా కాస్తున్న అటవీ శాఖ ఉద్యోగులు

- తవ్వకాల కట్టడికి చర్యలు

- నలుగురిపై బైండోవర్‌, 14 మందిపై కేసులు

- మైదాన ప్రాంత వ్యాపారుల పాత్రపై విచారణ

- డీఎఫ్‌వో వైవీ నరసింహరావు

చింతపల్లి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పెదవలస రేంజ్‌ పరిధి సిగినాపల్లి రంగురాళ్ల క్వారీలో శాశ్వత బేస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశామని డివిజనల్‌ ఫారెస్టు అధికారి(డీఎఫ్‌వో) వైవీ నరసింహరావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సిగినాపల్లి రంగురాళ్ల క్వారీలో తవ్వకాలను కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వలన క్వారీలో తవ్వకాలు నిర్వహించే అవకాశం ఉండడంతో అటవీశాఖ ఉద్యోగులను అప్రమత్తం చేశామన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా గతంలో రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహించిన నలుగురు వ్యాపారులపై బైండోవర్‌ కేసు పెట్టామని తెలిపారు. జీకేవీధి పోలీసులకు అటవీశాఖ ఫిర్యాదు చేయడంతో 14 మంది వ్యాపారులు, కూలీలపై కేసులు పెట్టారన్నారు. తవ్వకాలపై మైదాన ప్రాంత రంగురాళ్ల వ్యాపారుల పాత్రపై విచారణ చేపడుతున్నామన్నారు. మైదాన ప్రాంతాలకు చెందిన వ్యాపారులపై బైండోవర్‌ కేసులు పెడతామని చెప్పారు. నర్సీపట్నానికి చెందిన ముగ్గురు, తునికి చెందిన ఇద్దరు వ్యాపారులకు నోటీసులు జారీ చేశామన్నారు. క్వారీలో 24 గంటలు గస్తీ నిర్వహించేందుకు శాశ్వత బేస్‌ క్యాంప్‌ సిబ్బందిఐదుగురిని నియమించామన్నారు. అలాగే స్ట్రైకింగ్‌ ఫోర్సు సిబ్బంది, అటవీశాఖ ఉద్యోగులు సైతం క్వారీ వద్ద గస్తీ నిర్వహిస్తున్నారని తెలిపారు. గతంలో క్వారీ వద్ద తవ్వకాలు నిర్వహించిన కూలీలు, వ్యాపారుల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. అనుమానిత వ్యాపారులు, కూలీలు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సంతకాలు చేసే విధంగా ఏర్పాటు చేశామన్నారు. గతంలో రంగురాళ్ల కేసుల్లో నిందితులను పిలిచి కౌన్సెలింగ్‌ చేస్తామన్నారు. క్వారీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేయాలని జీకేవీధి తహశీల్దార్‌ని కోరామని చెప్పారు. ఈ సెక్షన్‌ రెండు రోజుల్లో అమలులోకి వస్తుందన్నారు. క్వారీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా గుంపులుగా సంచరిస్తే కేసులు పెడతామన్నారు. క్వారీ ప్రాంతాన్ని పూర్తిగా నిషేధించామన్నారు. క్వారీ వద్దకు ఎవరు వచ్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దసరా ఉత్సవాల్లో క్వారీ వద్ద తవ్వకాలు నిర్వహించే అవకాశం ఉండడంతో అదనపు సిబ్బందిని క్వారీ వద్ద ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

Updated Date - Sep 24 , 2025 | 12:49 AM