పెట్టుబడుల సదస్సుకు పక్కాగా ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:46 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు ఈనెల 12వ తేదీ సాయంత్రానికి పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఆదేశించారు.
రేపు సాయంత్రంకల్లా పూర్తికావాలి
12వ తేదీ రాత్రికి నగరానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
13న సీఐఐ, రాష్ట్ర అధికారులతో భేటీ
రాత్రికి అతిథులకు విందు
14న ఉపరాష్ట్రపతి, గవర్నర్ రాక
కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్
విశాఖపట్నం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు ఈనెల 12వ తేదీ సాయంత్రానికి పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి సమన్వయ లోపం లేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సదస్సుకు రెండు రోజులు ముందుగా అంటే...ఈనెల 12వ తేదీ రాత్రికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నగరానికి చేరుకుంటారన్నారు. ఆ మరుసటిరోజు 13వ తేదీన సీఐఐ ప్రతినిధులు, రాష్ట్ర అధికారులతో సీఎం ప్రత్యేకంగా భేటీయి ప్రాథమిక స్థాయి సమావేశాలు నిర్వహిస్తారని, సాయంత్రం అతిథులతో కలిసి గాలా డిన్నర్‌లో పాల్గొంటారన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పటిష్టమైన ఏర్పాట్లుచేయాలన్నారు. సదస్సులో భారత ఉపరాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు భాగస్వామ్యులు కానున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. సాధ్యమైనంత వరకు డెలిగేట్లకు కిట్లు రిజిస్ట్రేషన్ సమయంలోనే అందజేయాలన్నారు. స్పాట్ రిజిస్ట్రేషన్లు ఉండవని స్పష్టంచేశారు. శంకుస్థాపనలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లుచేసుకోవాలన్నారు. వీఐపీ, వీవీఐపీల ప్రవేశం, నిష్క్రమణ ద్వారాలు ఏర్పాటుచేయాలన్నారు. నిరంతరం విద్యుత్, ఇంటర్‌నెట్ సదుపాయం కల్పించాలని చెప్పారు. దేశ, విదేశాల నుంచి వచ్చే అతిథులకు సంప్రదాయ, సాంస్కృతిక నృత్యాలతో ఆత్మీక స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని విభాగాల అధికారులు 12వ తేదీ సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తిచేసి, ట్రయల్ రన్ నిర్వహించాలని సూచించారు. కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, పోలీస్ అధికారులు భద్రతాపరమైన చర్యల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని విషయాల్లో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమీక్షలో రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టీ, జేసీ మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ చందోలు, సత్తిబాబు, లతామాధురి, వెంకటరత్నం, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.