Share News

ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందాలి

ABN , Publish Date - Oct 23 , 2025 | 01:23 AM

ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని శాసనసభా పక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్‌, డిప్యూటీ స్పీకర్‌ కె.రఘురా మకృష్ణరాజు ఆదేశించారు. కల్తీలేని ఆహారం అందించాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందాలి

అధికారులకు శాసనసభా పక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్‌,

డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు ఆదేశం

విశాఖపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):

ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని శాసనసభా పక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్‌, డిప్యూటీ స్పీకర్‌ కె.రఘురా మకృష్ణరాజు ఆదేశించారు. కల్తీలేని ఆహారం అందించాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

వివిధ ఫిర్యాదుల పరిశీలనలో భాగంగా శాసనసభాపక్ష ఫిర్యాదుల కమిటీ బుధవారం నగరానికి విచ్చేసింది. ముందుగా వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని అంశాలపై సమీక్షించింది. హీమోఫీలియా వ్యాధిగ్రస్తులను ప్రత్యేకంగా పరిగణించి, మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో కేజీహెచ్‌లో హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు చేపడుతున్న చర్యలు, ఎన్టీఆర్‌ వైద్య సేవలపై కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం కమిటీ సభ్యులు పలు సూచనలిచ్చారు. హీమోఫీలియాతో వస్తున్న వారికి తక్షణ సాయం అందించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.48 వేలకు తగిన మందులు ఇవ్వాలన్నారు. డే కేర్‌ కేటగిరీలో వైద్య సేవలు అందించాలని కమిటీ చైర్మన్‌ సూచించారు. అంగవైకల్యం ధ్రువపత్రాలు అందించేందుకు ఉన్నతస్థాయిలో చర్చించి చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ డిప్యూటీ సెక్రటరీ శోభికను చైర్మన్‌ ఆదేశించారు. అనకాపల్లి జిల్లాలో 53 కేసులున్నాయని, వారికి వైద్య సేవలు అందుతున్నాయని సంబంధిత అధికారులు వివరించారు.

అనంతరం ఫుడ్‌ సేఫ్టీ విభాగంలో జరుగుతున్న కార్యకలాపాలు, చేపడుతున్న చర్యలపై కమిటీ సమీక్షించింది. స్టార్‌ హోటల్‌ మొదలుకొని వీధుల్లోని చిన్న హోటళ్ల వరకు ఆహారం కల్తీ జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు అప్రమత్తంగా ఉంటే ప్రజారోగ్యానికి భరోసా లభిస్తుందని డిప్యూటీ స్పీకర్‌ అన్నారు. ఇటీవల కురుపాం వసతిగృహంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా విస్తృత తనిఖీలు, పరీక్షలు నిర్వహించాలన్నారు. ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాల్లో కలర్స్‌ వాడకుండా చర్యలు తీసుకోవాలని, చికెన్‌, మటన్‌ తనిఖీలు చేపట్టాలన్నారు. సిబ్బంది కొరత గురించి ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ప్రస్తావించగా సచివాలయాల్లో విద్యార్హతలున్న వారిని వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తామని, సకాలంలో ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. మూడు నెలలకొకసారి విశాఖ వేదికగా సమావేశం నిర్వహిస్తామని చైర్మన్‌ తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, కొణతాల రామకృష్ణ, కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌, శాసనసభ డిప్యూటీ సెక్రటరీ కె.రాజాకుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 01:23 AM