నోటీసులిచ్చిన దివ్యాంగులకు పింఛన్లు
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:50 AM
వైద్య పరీక్షల్లో అనర్హులుగా తేలిన దివ్యాంగులకు గత నెల పింఛన్లు నిలిపివేశారు.
గ్రీవెన్స్‌లో వినతులిచ్చిన వారికి నేటి నుంచి పంపిణీ
విశాఖపట్నం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): వైద్య పరీక్షల్లో అనర్హులుగా తేలిన దివ్యాంగులకు గత నెల పింఛన్లు నిలిపివేశారు. అయితే వారిలో చాలామంది తాము అర్హులమంటూ అధికారులకు విన్నవించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం గ్రీవెన్స్‌లో వినతులిచ్చిన వారందరికీ పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలో సుమారు 1200 మందికి సోమవారం నుంచి పింఛను సొమ్ము పంపిణీ చేయనున్నారు. వైద్య పరీక్షల్లో 40 శాతం కంటే తక్కువ అంగవైకల్యం ఉన్నట్టు నిర్ధారించిన మేరకు జిల్లాలో 1,558 మంది పింఛన్లను గత నెల నిలిపివేశారు. జిల్లాలో రూ.6 వేల చొప్పున పింఛను తీసుకుంటున్న 21,306 మంది దివ్యాంగుల అంగవైకల్యంపై ఈ ఏడాది జనవరి నుంచి కేటగిరీల వారీగా వైద్య పరీక్షలు నిర్వహించారు. నిబంధనల మేరకు 40 శాతం అంగవైకల్యం ఉంటేనే పింఛన్‌కు అర్హులని నిర్ధారించారు. కానీ పరీక్షలలో 1,558 మంది 40 శాతం కంటే తక్కువగా అంగవైకల్యం ఉన్నట్టు ధ్రువీకరించారు. దీంతో వారికి గత నెల పింఛన్ నిలిపివేశారు. దీనిపై కలెక్టరేట్‌లోని ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతులు అందజేయడంతో ప్రభుత్వం స్పందించింది. పింఛన్ నిలిపివేతపై గ్రీవెన్స్ పెట్టుకోవాలని సూచించింది. దీంతో జిల్లాలో ఆదివారం సాయంత్రం వరకు సుమారు 1,200 మంది ఎంపీడీవోలు/ జోనల్ కమిషనర్లకు, కలెక్టరేట్‌లో ఫిర్యాదులు చేశారు. వీరికి సోమవారం నుంచి పింఛన్లు అందజేస్తారు. మిగిలిన దివ్యాంగులు కూడా వెంటనే గ్రీవెన్స్ పెట్టుకోవాలని అధికారులు సూచించారు. ఇదిలా వుండగా ఆగస్టు నెలకు సంబంధించి జిల్లాలో 1,60,429 మందికి రూ.70.05 కోట్లు పింఛన్ సొమ్ము విడుదలైంది. నాలుగు గ్రామీణ మండలాల్లో 26,636 మందికి రూ.11.20 కోట్లు, జీవీఎంసీ పరిధిలో 1,33,793 మందికి రూ.58.85 కోట్లు విడుదల కాగా శనివారమే సచివాలయాల సిబ్బందికి అందజేశారు.
జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్‌గా సత్యనారాయణరాజు
విశాఖపట్నం, ఆగస్టు 31 (ఆంధ్ర జ్యోతి): జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్‌గా పీవీవీ సత్యనారాయణరాజుని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగంలో సూపరింటెండెంట్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న పది మందికి చీఫ్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించింది. జీవీఎంసీలో ఎస్‌ఈలుగా పనిచేస్తున్న పీవీవీ సత్యనారాయణరాజుతోపాటు వై.కృష్ణారావుకు పదోన్నతి లభించింది. సత్యనారాయణరాజుకు జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్‌గా పోస్టింగ్ ఇవ్వగా కృష్ణారావుకు ఏపీ టిడ్కో సీఈగా డిప్యూటేషన్‌పై నియమించింది. జీవీఎంసీలో ప్రస్తుతం పూర్తిస్థాయి చీఫ్ ఇంజనీర్ లేకపోవడంతో ఎస్‌ఈ పి.పల్లంరాజు ఇన్‌చార్జి సీఈగా కొనసాగుతున్నారు.
ఆటోను ఢీకొట్టిన బైక్
ఇద్దరు యువకులు, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
ఒకరి పరిస్థితి విషమం
సరిపల్లి సర్వీసు రోడ్డు వద్ద ప్రమాదం
పెందుర్తి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి):
ద్విచక్ర వాహనం, ఆటో ఢీకొన్న సంఘటనలో ముగ్గురికి తీవ్రంగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన పెందుర్తి సమీప సరిపల్లి సర్వీసు రోడ్డు వద్ద ఆదివారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి...
పెందుర్తి మండలం సరిపల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన కండిపల్లి కన్నయ్య, భార్య దేవి, కుమారై భారతి, కోడలు నాగమణి తమ సొంత ఆటోలో అక్కిరెడ్డిపాలెంలోని బంధువుల ఇంటి పుట్టినరోజు వేడుకకు ఆదివారం రాత్రి బయలుదేరారు. సర్వీసు రోడ్డులో వెళ్తుండగా ఎదురుగా అత్యంత వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు తుళ్లి, రోడ్డుపై పడిపోయారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఆటో డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్‌ఐ నరసింగరాజు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో కెజీహెచ్‌కు తరలించారు. గాయపడిన యువకులు చినముషిడివాడకు చెందిన వారిగా గుర్తించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.