Share News

పెండింగ్‌లో మెస్‌ చార్జీలు

ABN , Publish Date - Jul 14 , 2025 | 12:44 AM

జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల మెస్‌ చార్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. గడిచిన మూడు నెలలు నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో వసతిగృహాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

పెండింగ్‌లో మెస్‌ చార్జీలు

  • జిల్లాలోని బీసీ, సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌కు మూడు నెలలు బిల్లులు మంజూరు కాని వైనం

  • ఒక్కో హాస్టల్‌కు నెలకు రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు..

  • ఆయా వార్డెన్లకు తప్పని ఇబ్బందులు

  • విద్యార్థులకు కాస్మోటిక్‌ చార్జీలను 11 నెలలుగా చెల్లించని ప్రభుత్వం

విశాఖపట్నం, జూలై 13 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల మెస్‌ చార్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. గడిచిన మూడు నెలలు నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో వసతిగృహాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో బీసీ, సాంఘిక సంక్షేమశాఖకు చెందిన 53 హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో సాంఘిక సంక్షేమశాఖకు చెందిన ఎనిమిది ప్రీ, 15 పోస్టు మెట్రిక్‌ హాస్టల్స్‌ ఉండగా, బీసీ సంక్షేమశాఖకు చెందిన 12 ప్రీ, 18 పోస్టు మెట్రిక్‌ హాస్టల్స్‌ ఉన్నాయి. ఒక్కో హాస్టల్‌లో 50 నుంచి వందమంది వరకు విద్యార్థులు ఉంటున్నారు. ప్రీ మెట్రిక్‌ హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ.1400 చొప్పున ప్రభుత్వం మెస్‌ చార్జీలను చెల్లిస్తోంది. పోస్టు మెట్రిక్‌ హాస్టల్‌ విద్యార్థికి నెలకు రూ.1,600 చొప్పున చెల్లిస్తున్నారు. ఆయా హాస్టళ్లకు మార్చి, ఏప్రిల్‌, జూన్‌ నెలలకు సంబంధించిన బిల్లులను చెల్లించాల్సి ఉంది. పోస్టు మెట్రిక్‌ హాస్టల్‌లో ఉండే విద్యార్థుల సంఖ్యను బట్టి నెలకు రూ.90 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు, ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లకు రూ.84 వేల నుంచి రూ.1.40 లక్షల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. సగటును చూసుకున్న ఒక్కో హాస్టల్‌కు నెలకు రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. మూడు నెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఒక్కో హాస్టల్‌కు మూడు రూ.లక్షలకు పైగానే బిల్లులు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు చెబుతున్నారు. మారిన మెనూ ప్రకారం ప్రతిరోజూ పోషకాలతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు వడ్డించాల్సి వస్తోందని, అయితే బిల్లులు పెడింగ్‌లో ఉండడంతో వెండర్స్‌ సరకులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని పేర్కొంటున్నారు. ఈ తరహా ఇబ్బందులు నిత్యం పరిపాటిగా మారడంతో తమకు అవస్థలు తప్పడం లేదని పలువురు వార్డెన్లు వాపోతున్నారు.

11 నెలలుగా కాస్మోటిక్‌ చార్జీలు పెండింగ్‌..

విద్యార్థులకు కాస్మోటిక్‌ చార్జీలను కూడా గడిచిన 11 నెలల నుంచి చెల్లించలేదు. వసతిగృహాల్లో ఉండే విద్యార్థుల కాస్మోటిక్‌ అవసరాల కోసం ప్రభుత్వం కొంత మొత్తం చొప్పున చెల్లిస్తోంది. పోస్టు మెట్రిక్‌ హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులకు రూ.210 నుంచి రూ.250, ప్రీ మెట్రిక్‌ హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులకు నెలకు రూ.110 నుంచి రూ.160 వరకు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే చివరిసారిగా కాస్మోటిక్‌ చార్జీలను గడిచిన ఏడాది ఆగస్టులో చెల్లించినట్టు తెలుస్తోంది. 11 నెలల నుంచి కాస్మోటిక్‌ చార్జీలు పెండింగ్‌లో ఉండడంతో విద్యార్థులు తల్లిదండ్రులే వారికి అవసరమైన కాస్మోటిక్‌ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న కాస్మోటిక్‌ చార్జీలను తక్షణమే చెల్లించాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.1,200 నుంచి రూ.1,700 వరకు ప్రభుత్వం కాస్మోటిక్‌ చార్జీలను చెల్లించాల్సి ఉంది.

Updated Date - Jul 14 , 2025 | 12:44 AM