అధ్వానంగా పెద్దగెడ్డ-కొండవంచుల రోడ్డు
ABN , Publish Date - Jul 13 , 2025 | 11:06 PM
మండలంలోని పెద్దగెడ్డ-కొండవంచుల రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. ఈ రోడ్డుకు 2018లో టీడీపీ ప్రభుత్వం రూ.1.75 కోట్లు మంజూరు చేసింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డు టెండర్‌ను రద్దు చేసింది. ఐదేళ్లు వైసీపీ పాలకుల దృష్టికి ఆదివాసీలు ఎన్ని పర్యాయాలు తీసుకువెళ్లినా రోడ్డు పనులు ప్రారంభం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారిపై భారీ గోతులు ఏర్పడి, అత్యంత అధ్వానంగా తయారైంది.
వర్షాలకు దారుణంగా తయారైన రహదారి
రాకపోకలకు అవస్థలు పడుతున్న ఆదివాసీలు
టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.1.75 కోట్లు విడుదల
ఐదేళ్లూ నిర్మాణాలపై నిర్లక్ష్యం చేసిన వైసీపీ పాలకులు
చింపతల్లి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి-నర్సీపట్నం ప్రధాన రహదారి పెద్దగెడ్డ నుంచికొండవంచుల వరకు గతంలో మెటల్ రోడ్డు నిర్మించారు. దీనిని తారు రోడ్డు నిర్మాణానికి 2018వ సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం రూ. 1.75 కోట్లు మంజూరు చేసింది. దీంతో నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్ రహదారి నిర్మాణాలకు అవసరమైన ఎర్తువర్క్ పనులు కొంత వరకు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 25 శాతం పనులు పూర్తికాలేదని ఈ టెండర్‌ని రద్దు చేసింది. దీంతో ఈ రహదారి నిర్మాణాలు మరుగునపడిపోయాయి. ఐదేళ్లపాటు ఆదివాసీలు రహదారి నిర్మాణం కోసం పలు మార్లు వైసీపీ పాలకులు దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఈ ఏడాది కురిసిన వర్షాలకు ఈ మార్గం మరింత అధ్వానంగా తయారైంది. దీంతో రాకపోకలు సాగించేందుకు గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఈ రహదారి 24 గ్రామాల గిరిజనులకు ఆధారం. ప్రతి రోజూ ఆదివాసీలు వివిధ పనులు నిమిత్తం మండల కేంద్రానికి వస్తుంటారు. ప్రస్తుతం రోడ్డు అధ్వానంగా ఉండడంతో వ్యవసాయ ఉత్పత్తులు సంతలకు తరలించేందుకు ఆదివాసీలు పెద్ద సాహసమే చేయాల్సి వస్తున్నది. వర్షాకాలం వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. ఆటోలు, ద్విచక్రవాహనాలు ఈమార్గంపై ప్రయాణించడం వల్ల తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి.
ఆర్టీసీ సర్వీసు రద్దు..
పెద్దగెడ్డ-కొండవంచుల గ్రామాలకు గతంలో ఆర్టీసీ బస్సు సర్వీసు ఉండేది. నర్సీపట్నం డిపోకు చెందిన బస్సు చింతపల్లి నుంచి ప్రతి రోజూ నాలుగు సార్లు తిరిగేది. అయితే రహదారి అత్యంత అధ్వానంగా మారడంతో ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసును రద్దు చేశారు. బస్సు సర్వీసును పునరుద్ధరించాలని స్థానిక గిరిజనులు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. రహదారి మరమ్మతులు చేపడితే ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరిస్తామని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.