Share News

కాలుష్యంపై పీసీబీ ఫోకస్‌

ABN , Publish Date - Dec 22 , 2025 | 01:22 AM

నగరంలో గాలినాణ్యత క్షీణించడం, కాలుష్య తీవ్రత పెరగడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

కాలుష్యంపై  పీసీబీ ఫోకస్‌

పలు కంపెనీల్లో అధికారుల బృందం పరిశీలన

వెలుగులోకి వచ్చిన నిబంధనల ఉల్లంఘన

అడ్డగోలుగా స్టాకు యార్డుల నిర్వహణ

ధూళి నియంత్రణలో అమలుకాని నిబంధనలు

గాలి నాణ్యతా సూచీ మిషన్లలో తప్పుడు రీడింగ్‌

పలు సంస్థలకు నేడో రేపో నోటీసులు జారీ

దిద్దుబాటు లేకుంటే పర్యావరణ పరిహారం వసూలుకు చర్యలు

విశాఖపట్నం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి):

నగరంలో గాలినాణ్యత క్షీణించడం, కాలుష్య తీవ్రత పెరగడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇందుకు కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేకించి టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఆదివారం పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో తనిఖీలు చేశారు. కాలుష్య నియంత్రణ నిబంధనల అమల్లో అన్ని సంస్థలు ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. విశాఖపట్నం, గంగవరం పోర్టులు, ఆర్సెల్లార్‌మిట్టల్‌ స్టీల్‌, ఆర్‌సీఎల్‌, హిందూజా, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, వైజాగ్‌ జనరల్‌ కార్గో బెర్త్‌, హెచ్‌పీసీఎల్‌లో ప్రమాణాలు పాటించడంలేదని తనిఖీలలో తేలింది.

పోర్టులు, కోరమాండల్‌, ఆర్సెల్లార్‌ మిట్టల్‌ స్టీల్‌లో స్టాకు యార్డుల నిర్వహణలో యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. యార్డులపై అరకొరగా టార్పాలిన్లు కప్పడంతో ధూళి గాలిలోకి కలుస్తోంది. కాలుష్య నియంత్రణ మండలి జాయింట్‌ చీఫ్‌ శంకర్‌నాయక్‌, ఎస్‌ఈ రామారావునాయుడు, ఈఈలు పీవీ ముకుందరావు, పి.శ్రీనివాసరావు, అధికారులు బుచ్చిబాబు, వీరేంద్రతోసహా మొత్తం ఆరు బృందాలగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. విశాఖ పోర్టులో బొగ్గునిల్వల కోసం నిర్మించిన షెడ్లలలో ఎరువులు నిల్వచేశారు. ఎక్కడికక్కడ ధూళి రేగి తీవ్రమైన కాలుష్యం వెలువడుతోంది. రోడ్లపై స్ర్పింకర్లతో నీటిని వెదజల్లుతున్నా యార్డుల నిర్వహణ లోపభూష్టంగా ఉందని తనిఖీలలో గుర్తించారు. వేదాంత కార్గోలో యార్డులపై టార్పాలిన్లులేవు. వాహనాల నుంచి బొగ్గు, ఇతర సరుకు అన్‌లోడ్‌ తరువాత కూడా ధూళి రావడంతో గాలిలో నాణ్యత ప్రమాణాలు పడిపోతున్నాయి. కోరమాండల్‌లో జిప్సమ్‌ గుట్టలు ఎక్కువగా పేరుకుపోవడంతో పాటు వాటిపై టార్పాలిన్లు సరిగ్గా కప్పలేదు. ఆర్సెల్లార్‌మిట్టల్‌ స్టీల్‌లో ధూళి తీవ్రత ఎక్కువగా ఉంది. విచిత్రంగా కంపెనీ సొంతంగా ఏర్పాటుచేసిన ఆన్‌లైన్‌ యాంబియంట్‌ ఎయిర్‌క్వాలిటీ మిషన్లలో తక్కువగా ధూళి కణాల నమోదును చూపిస్తుండడంతో అధికారులకు అనుమానం వచ్చింది. షీలానగర్‌ నుంచి పోర్టుకు వచ్చే రోడ్డు పక్కన భారీగా చెత్తకు నిప్పుపెట్టడంతో ఈ ప్రాంతమంతా పొగకమ్మేసింది. ఆర్‌సీఎల్‌లో ధూళి తీవ్రత అధికంగా ఉందని గుర్తించారు. హిందూజా పవర్‌ కార్పొరేషన్‌లో ధూళి నియంత్రణకు అనువుగా చర్యలు తీసుకోడంలేదని తనిఖీలలో తేలింది.

కాగా ఆయా కంపెనీల్లో ఉల్లంఘనలపై ఒకటిరెండు రోజుల్లో నోటీసులు జారీచేయాలని పీసీబీ నిర్ణయించింది. ఆ తరువాత వారం రోజుల్లో పరిస్థితులు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోకపోతే సంస్థలకు పర్యావరణ పరిహారం చెల్లించాలని నోటీసులు ఇస్తామని పీసీబీ ఈఈ ముకుందరావు తెలిపారు. మొత్తం ఆరు బృందాలు ప్రతి రోజు ఆయా సంస్థలను తనిఖీలు చేస్తాయని చెప్పారు. కంపెనీ కార్యకలాపాల నిర్వహణలో భాగంగా కాలుష్యనియంత్రణ, గాలి నాణ్యత పెంపుదలకు అనువుగా చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 01:22 AM