పవన్ నిర్ణయంతో రాష్ట్ర దశ, దిశ మారాయి
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:34 AM
రాష్ట్రం కష్టకాలంలో వున్నప్పుడు, విధ్వంస పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, ఈ నిర్ణయంతోనే ఇప్పుడు రాష్ట్రం దశ, దిశ మారుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.

మంత్రి నాదెండ్ల మనోహర్
నక్కపల్లి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రం కష్టకాలంలో వున్నప్పుడు, విధ్వంస పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, ఈ నిర్ణయంతోనే ఇప్పుడు రాష్ట్రం దశ, దిశ మారుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం రాత్రి జనసేన నేత గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో గొడిచెర్ల వద్ద నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. పవన్ కల్యాణ్ ఆలోచనలు చాలా గొప్పవని, ఆయన ఏ విషయమైనా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే తప్ప మాట్లాడరని అన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్మోహన్‌రెడ్డిపై కోడికత్తితో దాడి.. ఒక నాటకమని తేలిపోయిందన్నారు. జనసేన అధినేత పవన్‌ను విమర్శించే నైతిక అర్హత జగన్‌కు లేదని, ఆయన కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువని ఎద్దేవా చేశారు. కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తున్నదని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత జరుపుకుంటున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం జనసైనికులకు నిజమైన పండుగన్నారు. పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు జనసైనికులు అండగా నిలబడ్డారని కొనియాడారు. గెడ్డం బుజ్జి మాట్లాడుతూ, హోం మంత్రికి, తమకు మధ్య ఎటువంటి గ్యాప్ లేదని, సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్, పంతం నానాజీ, పలువురు నాయకులు పాల్గొన్నారు.