ఇంటి నిర్మాణం చేపట్టకుంటే పట్టా రద్దు
ABN , Publish Date - Jul 18 , 2025 | 01:22 AM
జిల్లాలో పేదల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని హౌసింగ్ అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఆదేశించారు.
ముందు నోటీస్, ఆ తరువాత చర్యలు
కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్
పేదల గృహ నిర్మాణం వేగవంతం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశం
నాణ్యత లోపిస్తే క్రిమినల్ చర్యలు
విశాఖపట్నం, జూలై 17 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో పేదల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని హౌసింగ్ అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలపై గృహనిర్మాణ సంస్థ, గ్రామీణ నీటి సరఫరా, జీవీఎంసీ, ఈపీడీసీఎల్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే వారంలో గ్రామ సచివాలయాల్లో సభలు నిర్వహించి ఇప్పటివరకూ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోతే ఇళ్లతోపాటు పట్టాలు రద్దు చేస్తామనే విషయం చెప్పాలన్నారు. వారం రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోతే నోటీస్‌లు జారీచేసి, ఆ తరువాత కేటాయింపును రద్దు చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసిన కాలనీల్లో మౌలిక వసతులు, విద్యుత్, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. త్వరలో నిర్మాణాలు పూర్తికానున్న లేఅవుట్‌లలో కూడా వసతుల కల్పనపై దృష్టిసారించాలన్నారు. అన్ని లేఅవుట్‌లలో ఏడాదికాలంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టంచేశారు. నాణ్యతా లోపం ఉంటే గృహ నిర్మాణ సంస్థ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమీక్షలో గృహ నిర్మాణ సంస్థ పీడీ సత్తిబాబు, గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఈపీడీసీఎల్, జీవీఎంసీ ఎస్‌ఈలు కేవీవీ చౌదరి, శ్యాంబాబు, రవి, హౌసింగ్ ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.