ప్రగతికి బాటలు
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:43 AM
అనకాపల్లి నుంచి అన్నవరం మీదుగా దివాన్ చెరువు వరకు జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. జిల్లా పరిధిలో 64.645 కిలోమీటర్ల వరకు విస్తరణ పనులు చేపట్టనున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం డీపీఆర్ తుది దశకు చేరుకోగా, టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధమవుతోంది.
- అనకాపల్లి నుంచి దివాన్‌చెరువు వరకు ఆరు లైన్ల జాతీయ రహదారి విస్తరణకు వేగంగా అడుగులు
- తుది దశకు డీపీఆర్
- టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు సన్నద్ధం
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
అనకాపల్లి నుంచి అన్నవరం మీదుగా దివాన్ చెరువు వరకు జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. జిల్లా పరిధిలో 64.645 కిలోమీటర్ల వరకు విస్తరణ పనులు చేపట్టనున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం డీపీఆర్ తుది దశకు చేరుకోగా, టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధమవుతోంది.
ఈ జాతీయ రహదారిని 2004లో నాలుగు లైన్ల రహదారిగా అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. వాస్తవానికి శ్రీకాకుళం నుంచి ఆనందపురం వరకు మాత్రమే ఆరు లైన్ల జాతీయ రహదారి ప్రస్తుతం ఉంది. మిగిలిన రహదారి నాలుగు లైన్లగానే ఉంది. ప్రస్తుతం పెరిగిన ట్రాఫిక్, అంతర్రాష్ట్ర రవాణా వ్యవస్థ అభివృద్ధిని పరిగణనలోకి తీసుకొని దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను విస్తరించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా అనకాపల్లి నుంచి అన్నవరం మీదుగా దివాన్‌చెరువు వరకు జాతీయ రహదారిని మళ్లీ ఎన్‌డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆరు లైన్ల రహదారిగా విస్తరణ జరిపేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ రహదారి అభివృద్ధికి గత ఏడాది డిసెంబరు నెలలో డీపీఆర్ రూపకల్పన కోసం టెండర్లు పిలిచారు. ఇప్పటికే అనకాపల్లి నుంచి అన్నవరం మీదుగా దివాన్‌చెరువు వరకు ఆరు లైన్లుగా విస్తరణకు అవసరమయ్యే భూమి, అండర్ పాత్ వేలు, వంతెనలు, సర్వీస్ రోడ్ల నిర్మాణ వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరడంతో త్వరలోనే పనులు ప్రారంభించేందుకు టెండర్ల ప్రక్రియను జరిపేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధమవుతోంది. విస్తరణ పనులు జిల్లాలో అనకాపల్లి డైట్ కాలేజీ నుంచి ప్రారంభమై కశింకోట, ఎలమంచిలి, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాలను కలుపుకుంటూ జరుగుతాయి.
పారిశ్రామిక రంగానికి ఎంతో మేలు
జాతీయ రహదారి విస్తరణ పనులతో జిల్లా పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చెందనున్నది. వచ్చే ఏడాది జిల్లా పారిశ్రామిక వృద్ధి 46 శాతం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చిన్న మధ్యతరగతి పరిశ్రమల పార్కు (ఎంఎస్‌ఎంఈ)లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంటు రానున్నాయి. జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తయితే పారిశ్రామిక రంగానికి ఎంతో మేలు జరుగుతుంది.