అరకులోయలో పాసింజర్ హాల్ట్
ABN , Publish Date - Oct 10 , 2025 | 10:42 PM
అరకులోయ రైల్వే రిక్వెస్టు స్టేజీ వద్ద శాశ్వత ప్రాతిపదికన పాసింజరు హాల్ట్ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పనులకు రైల్వే మంత్రి డేష్ బోర్డు నుంచి రూ.2.6 కోట్లు మంజూరయ్యాయి.
రూ.2.6 కోట్లు మంజూరు చేసిన రైల్వేమంత్రి
పనులు ప్రారంభించిన అధికారులు
అరకులోయ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): అరకులోయలో ఉన్న రైల్వే రిక్వెస్టు స్టేజీ వద్ద పాసింజరు రైళ్లు పర్యాటకులు, స్థానిక ప్రయాణికుల సౌకర్యార్ధం ఐదు నిమిషాలు నిలుపుదల చేసేవారు. అయితే 2025 జనవరి నుంచి రిక్వెస్టు స్టేజీ వద్ద రైళ్లు నిలపకుండా నేరుగా యండపల్లివలసలో ఉన్న అరకు రైల్వే స్టేషన్‌లో ఆపేవారు. దీంతో బొర్రా, కరకవలస, సిమిలిగుడ వంటి రైల్వే స్టేషన్‌లలో ఎక్కె గిరిజనులు, స్థానికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అరకు రైల్వే స్టేషన్ నుంచి కాలినడకన, ఆటోలను ఆశ్రయించి అరకులోయ చేరుకుంటున్నారు. అలాగే రిక్వెస్టు స్టేజీ వద్ద ప్రయాణికులు, పర్యాటకులపై ఆధారపడే ఆటోవాలాలు, హోటళ్లు వారు తమ జీవనాధారం కోల్పోయారు. దీంతో వీరంతా ఎంపీ తనుజారాణిని కలిసి తమ గోడును చెప్పుకున్నారు. ఈ విషయమై అరకులోయ ఎంపీ రైల్వే మంత్రికి వినతిపత్రం ఇవ్వడంతో ఆయన అరకులోయ రిక్వెస్టు స్టేజీ వద్ద పాసింజర్ హాల్ట్ మంజూరు చేశారు. అంతేకాకుండా శాశ్వత ప్లాట్‌ఫాం కోసం రూ.2.6 కోట్లు మంజూరు చేశారు. ఇక్కడ మౌలిక సౌకర్యాలు కల్పనకు చర్యలు చేపడుతుండడంతో గిరిజనులు, పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.