సమర్థుడికే అరకు పార్లమెంటరీ అధ్యక్ష పదవి
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:53 AM
పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకునే వారికే అరకు పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవిని అప్పగిస్తామని రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకునే వారికే అవకాశం
గ్రామ స్థాయి నాయకుల నుంచి ఎమ్మెల్యేల వరకు అందరికీ సమయం కేటాయించే వారై ఉండాలి
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి
విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విశాఖపట్నం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకునే వారికే అరకు పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవిని అప్పగిస్తామని రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం విశాఖలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అరకు పార్లమెంటరీకి కొత్త అధ్యక్షుని ఎన్నిక కోసం నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఈ కార్యక్రమానికి అధిష్ఠానం నుంచి పరిశీలకునిగా వచ్చిన మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్లమెంటరీ అధ్యక్షుడు తన పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, మండల, గ్రామ కమిటీ నాయకులను సమన్వయం చేసుకోవడంతో పాటు వారికి సమయం కేటాయించేవాడై ఉండాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, అదే సమయంలో విపక్ష పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని తెలిపారు. దీనికి అనుగుణంగా అధ్యక్ష పదవిపై ఆసక్తి ఉన్న నాయకులు తమ వినతులు అందజేయాలని, ఇంకా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. అనంతరం రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏకైక ఎస్టీ పార్లమెంటరీ నియోజకవర్గం అరకు అని పేర్కొంటూ అటువంటి చోట గిరిజనుడికే అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలన్నారు. చాలా కాలం తరువాత అరకు పార్లమెంటరీ పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలను కూటమి పార్టీలు కైవసం చేసుకోవడం గొప్ప విజయమన్నారు. ఈ తరుణంలో పార్లమెంటరీ పరిధిలో పార్టీని మరింతగా పటిష్టం చేసే వ్యక్తులు అవసరమన్నారు. గ్రామ స్థాయి నుంచి కేడర్, నాయకులను సమన్వయం చేసుకోవాలన్నారు. ఇంకా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే వైసీపీ సైకో బ్యాచ్‌ను దీటుగా ఎదుర్కొనాలని తెలిపారు. అరకు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కిడారి శ్రావణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరిశీలకులుగా వచ్చిన ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, ఏలూరు ఎమ్మెల్యే బడే రాధాకృష్ణ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఒక్కొక్కరితో ముగ్గురు పరిశీలకులు అభిప్రాయాలు సేకరించారు.