పార్కులు అన్యాక్రాంతం!
ABN , Publish Date - Jul 08 , 2025 | 01:02 AM
జీవీఎంసీ ఆస్తులుగా రికార్డుల్లో కొనసాగుతున్న పార్కులపై కూటమిలోని కొందరు నేతల కన్నుపడింది.
రికార్డుల్లో దశాబ్దాలుగా జీవీఎంసీ పార్కులుగా మార్కింగ్
వాటిని కొట్టేయాలని కొందరి యత్నం
వెనకుండి తతంగం నడిపిస్తున్న నేతలు
ఈస్ట్‌పాయింట్ కాలనీలోని రెండు పార్కులపై కూటమి నేత కన్ను
మహిళతో అగ్రిమెంట్
ప్రైవేటు స్థలంగా నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చేందుకు సిద్ధపడిన టౌన్‌ప్లానింగ్
రాజేంద్రనగర్ పార్కు ప్రైవేటు స్థలంగా నివేదిక ఇచ్చిన జీవీఎంసీ సర్వేయర్
వెనుక మాజీ ఎమ్మెల్యే, ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు
వీఎల్‌టీ విధించాలని రెవెన్యూ విభాగం అధికారులపై ఒత్తిడి
డీసీఆర్ తిరస్కరించడంలో నిలిచిన ప్రక్రియ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ ఆస్తులుగా రికార్డుల్లో కొనసాగుతున్న పార్కులపై కూటమిలోని కొందరు నేతల కన్నుపడింది. ప్రైవేటు వ్యక్తులను ముందుంచి పార్కు స్థలాలను కొట్టేయాలని చూస్తున్నారు. ఇప్పటికే మధురవాడలోని బటర్‌ఫ్లై పార్కులో 400 గజాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు అనుకూలంగా ఉత్తర్వులు తీసుకువచ్చారు. తాజాగా నగర నడిబొడ్డున ఉన్న రాజేంద్రనగర్ పార్కు, ఈస్ట్‌పాయింట్ కాలనీలోని రెండు పార్కులను కూడా చేజిక్కించుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు.
జీవీఎంసీ 20వ వార్డు పరిధి ఈస్ట్‌పాయింట్ కాలనీలోని షిర్డీ సాయిబాబా ఆలయ సమీపాన బాబాచావడి, లెండీవనం అని రెండు పార్కులు ఉన్నాయి. వాల్తేరు వార్డు టౌన్ సర్వే నంబర్ 124లో ఉన్న బాబాచావడి పార్కు 1,397 చదరపు గజాలు, లెండీవనం పార్కు 2,263 గజాల్లో విస్తరించి ఉంది. రెండు పార్కులు సుమారు 30 ఏళ్లుగా టౌన్ సర్వే రికార్డుల్లో జీవీఎంసీ ఆస్తులుగానే ఉన్నాయి. వీటిని పలుమార్లు జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేసింది. అయితే అవి తమవంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు కొన్నేళ్ల కిందట జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసులో జీవీఎంసీ గెలిచింది. తర్వాత ప్రైవేటు వ్యక్తులు దీనిపై హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా జీవీఎంసీయే గెలిచింది. ఇదిలావుండగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ఒక నేత కళ్లు ఆ రెండు పార్కులపై పడ్డాయి. ఆ పార్కులు తమకు చెందినవంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న మహిళతో సేల్ అగ్రిమెంట్ చేయించుకున్నారు. తర్వాత ఆ పార్కులను అధికారికంగా కొట్టేసేందుకు తన అధికారబలం ఉపయోగించారు. ఆ స్థలం ప్రైవేటు వ్యక్తులకు చెందినదేనంటూ సర్వే సర్టిఫికెట్ ఇవ్వాలంటూ జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులపై ఒత్తిడి చేశారు. అధికారులు దీనికి సానుకూలంగా ఉన్న సమయంలో ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల ముందు సదరు నేత కూటమిలోని ఒక పార్టీలో చేరారు. ఇంకేముంది అధికారం చేతిలో ఉండడంతోపాటు అధికారులు కూడా తన మాటకు ఎదురుచెప్పలేని పరిస్థితి ఏర్పడడంతో ఈస్ట్‌పాయింట్ కాలనీలోని రెండు పార్కులను కొట్టేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ స్థలాన్ని సర్వే చేసిన టౌన్‌ప్లానింగ్ అధికారులు ప్రైవేటు స్థలంగా నివేదిక ఇచ్చేందుకు అంతా సిద్ధం చేశారు. విషయం స్థానిక కార్పొరేటర్‌కు తెలియడంతో ఇటీవల జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈస్ట్‌పాయింట్ కాలనీలోని రెండు పార్కులను కబ్జాదారుల నుంచి కాపాడాలంటూ ప్లకార్డులు పట్టుకుని కుర్చీ పైకెక్కి నినాదాలు చేయడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. దీంతో అప్పటికే పార్కులు రెండు ప్రైవేటు స్థలాలుగా నిర్ధారిస్తూ తయారుచేసిన నివేదికను సదరు ప్రజా ప్రతినిధి చేతికి అందజేసిన అధికారులు...అధికారికంగా ఇవ్వడానికి వెనుకంజ వేశారు. దీంతో పార్కులు జీవీఎంసీ చేతి నుంచి చేజారిపోయే ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌పడింది.
ప్రైవేటు ఆస్తిగా రాజేంద్రనగర్ పార్కు
రేసపువానిపాలెం సర్వే నంబర్ 37/2లో ఉన్న రాజేంద్రనగర్ పార్కు తనదంటూ ఒకరు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు అందులో 1,452 గజాలు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి చెందినదిగా పేర్కొంటూ సర్టిఫికెట్ జారీచేసేయడం చర్చనీయాంశంగా మారింది. రాజేంద్రనగర్ రెసిడెంట్స్ పేరుతో రేసపువానిపాలెం సర్వే నంబర్ 37లోని 4.4 ఎకరాల్లో హెచ్‌పీసీఎల్ తమ సంస్థ ఉద్యోగుల కోసం 1962, 1971లో రెండు లేఅవుట్‌లు వేసింది. అందులో 1.7 ఎకరాలను పార్కుగా మార్కింగ్ చేసింది. అయితే పార్కుగా మార్కింగ్ చేసిన స్థలం తమదంటూ ఒక వ్యక్తి కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు. దీనిపై రెండుసార్లు హైకోర్టులో కేసులు వేయగా రెండుసార్లు జీవీఎంసీయే గెలుచుకుంది. అయితే వైసీపీ హయాంలో సదరు ప్రైవేటు వ్యక్తి జీవీఎంసీ కౌన్సిల్‌లో కీలకంగా వ్యవహరించిన సీనియర్ కార్పొరేటర్‌తోపాటు మరొక మహిళా కార్పొరేటర్ సహకారంతో పార్కులోని 1,452 గజాల స్థలం కొట్టేయడానికి స్కెచ్ వేశారు. వారిద్దరూ జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి చేసి ప్రైవేటు స్థలంగా పేర్కొంటూ టౌన్‌ప్లానింగ్ విభాగంలోని సర్వేయర్ ద్వారా సర్టిఫికెట్ సంపాదించాలని యత్నించినా అధికారులు రకరకాల కారణాలతో పెండింగ్‌లో ఉంచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే ఒకరిని ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు కలిశారు. రాజేంద్రనగర్ పార్కు డీల్‌ను వివరించారు. దీనికి ఆయన కూడా అంగీకరించడంతో అధికారులపై ఒత్తిడి చేసి ప్రైవేటు స్థలంగా సర్వే రిపోర్టు సంపాదించేశారు. ఆ సర్వే సర్టిఫికెట్ ఆధారంగా ఖాళీ స్థలం పన్ను (వీఎల్‌టీ) విధించాలంటూ సదరు ప్రైవేటు వ్యక్తి జీవీఎంసీకి దరఖాస్తు చేసుకోగా జోన్-3 రెవెన్యూ అధికారులు జోనల్ కమిషనర్‌కు పంపించారు. జోనల్ కమిషనర్ కూడా వీఎల్‌టీ విధించేందుకు సమ్మతిస్తూ డీసీఆర్‌కు పంపించారు. ఆఫైల్‌లో కొన్ని లొసుగులు ఉన్నట్టు గుర్తించిన డీసీఆర్ ఆ స్థలాన్ని మరోసారి సర్వే చేసి అందులో ప్రభుత్వ భూమి ఏమైనా ఉందా?, లేదా? అని నిర్ధారిస్తూ సర్టిఫికెట్ జత చేయాలని కోరుతూ వెనక్కి పంపించేశారు. దీంతో సదరు ప్రైవేటు వ్యక్తి తన స్థలానికి వీఎల్‌టీ విధించాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించాలంటూ టౌన్ సర్వేయర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా హైకోర్టును ఆశ్రయించారు. కేసు హైకోర్టులో ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది.
అదేవిధంగా జీవీఎంసీ ఐదో వార్డు పరిధి బొట్టవానిపాలెంలోని ఈడబ్ల్యూఎస్ లేవుట్‌లోని ఐదెకరాల పార్కు స్థలంలో రెండు ఎకరాలను కొందరు కబ్జా చేసి పాకలు వేసినా అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే వార్డులో సాయినగర్ పార్కు స్థలం తమదని పరిహారంగా తమకు టీడీఆర్ జారీచేయాలంటూ ప్రైవేటు వ్యక్తులు జీవీఎంసీకి దరఖాస్తు చేశారు.