నవంబరు 5న ఫణిగిరి ప్రదక్షిణ
ABN , Publish Date - Oct 18 , 2025 | 01:01 AM
ప్రముఖ శైవక్షేత్రమైన పంచదార్ల ఉమాధర్మలింగేశ్వరస్వామివారి ఫణిగిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ అన్నారు.
భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
ఎమ్మెల్యే విజయ్‌కుమార్
రాంబిల్లి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ శైవక్షేత్రమైన పంచదార్ల ఉమాధర్మలింగేశ్వరస్వామివారి ఫణిగిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ అన్నారు. నవంబరు 5న జరిగే ఫణిగిరి పదక్షిణ కోసం శుక్రవారం ఆయన పంచదార్ల పుణ్యక్షేత్రం వద్ద పలు శాఖల అధికారులు, కూటమి నాయకులుతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గిరి ప్రదక్షిణ జరిగే మార్గంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని అన్నారు. దారిలో వివిధ ప్రదేశాల్లో తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూటమి నాయకులు దగ్గరుండి చూడాలన్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా అందరూ పనిచేయాలని కోరారు. అనంతరం ధర్మలింగేశ్వరస్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. పురోహితులు ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయమాధవి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ధూళి రంగనాయకులు, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు వి.దిన్‌బాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పప్పల నూకన్నదొర, సీఐ నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు.