Share News

పండు పడాల్‌ పోరాట పటిమ చిరస్మరణీయం

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:28 PM

స్వాతంత్య్ర ఉద్యమంలో అల్లూరి అనుచరుడు, గిరిజన వీరుడు బోనంగి పండు పడాల్‌ పోరాట పటిమ చిరస్మరణీయమని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌ కుమార్‌ అన్నారు. బుధవారం పండు పడాల్‌ స్వగ్రామం గొందిపాకలులో కూటమి ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా పడాల్‌ జయంతి వేడుకలను నిర్వహించింది.

పండు పడాల్‌ పోరాట పటిమ చిరస్మరణీయం
పండు పడాల్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తదితరులు

గిరిజన స్వాతంత్య్ర ఉద్యమ వీరుడి స్వస్థలం గొందిపాకలులో స్మారక పార్కు, హోం స్టే టూరిజం

వారసులకు స్వయం ఉపాధి పథకాలు

తొలిసారిగా అధికారికంగా పడాల్‌ జయంతి వేడుకలు

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

చింతపల్లి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి):

స్వాతంత్య్ర ఉద్యమంలో అల్లూరి అనుచరుడు, గిరిజన వీరుడు బోనంగి పండు పడాల్‌ పోరాట పటిమ చిరస్మరణీయమని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌ కుమార్‌ అన్నారు. బుధవారం పండు పడాల్‌ స్వగ్రామం గొందిపాకలులో కూటమి ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా పడాల్‌ జయంతి వేడుకలను నిర్వహించింది. తొలుత టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి పండుపడాల్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు ప్రధాన అనుచరుడిగా సాయుధ పోరాటంలో బ్రిటిష్‌ పాలకులను ఎదురించిన గొప్ప వీరుడు పండు పడాల్‌ అని అన్నారు. అండమాన్‌ సెల్యూలర్‌ జైలులో శిక్ష అంటే అసాధారణమైనదన్నారు. అండమాన్‌ సెల్యూలర్‌ జైలులో శిక్ష కాలంలోనే అనేకమంది మృతి చెందారన్నారు. దేశానికి స్వాతంత్య్రం రావడంతో జైలు నుంచి పండు పడాల్‌ విడుదల కావడం, అక్కడే స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని జీవితాన్ని ముగించారన్నారు. ఆయన చరిత్రను ప్రభుత్వం సేకరించిందన్నారు. లంబసింగిలో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంలో ఆయన విగ్రహంతో పాటు చరిత్రను ప్రదర్శిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మ్యూజియం నిర్మాణానికి నిధులు విడుదల చేసిందని, సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి వస్తుందన్నారు. పండు పడాల్‌ జన్మస్థలం గొందిపాకలు గ్రామాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తామన్నారు. పండు పడాల్‌ నూతన విగ్రహం ఏర్పాటుతో పాటు స్మారక పార్కు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామంలో హోం స్టే టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. హోం స్టేకి ముందుకొచ్చిన గిరిజనులకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు కేటాయిస్తామన్నారు. స్థానిక గిరిజనులు అరుదైన ఉద్యాన పంటలు సాగు చేస్తుండడంతో హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ తెలిపారు. లంబసింగి మ్యూజియంలో పండు పడాల్‌ పేరిట గిరిజన వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్‌ ఏర్పాటు చేస్తామని, ఈ స్టాల్‌లో స్థానిక గిరిజనులు పండించిన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు విక్రయించుకోవచ్చునన్నారు. పండు పడాల్‌ వారసులకు ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తామన్నారు. టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ పండు పడాల్‌ జయంతి వేడుకలను ప్రప్రథంగా అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆయన చరిత్ర భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గొందిపాకలు గ్రామాన్ని సందర్శక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం పండు పడాల్‌ వారసులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోరాబు అనుషదేవి, ఎంపీడీవో సీతామహాలక్ష్మి, ఎంఈవో పీబీవీవీవీ ప్రసాద్‌, డీఈఈ రఘునాథరావునాయుడు, ఏఈఈలు గడుతూరి స్వర్ణలత, బాలకిశోర్‌, లోకేశ్‌, సర్పంచ్‌ సాగిన వరలక్ష్మి, పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌ గెమ్మెలి అబ్బాయినాయుడు, గిరిజన ఉద్యోగుల సంఘం మండలాధ్యక్షుడు బౌడు గంగరాజు, టీడీపీ మండలాధ్యక్షుడు కిల్లో పూర్ణచంద్రరావు, సీనియర్‌ నాయకులు బొర్ర విజయరాణి, రీమల ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 11:28 PM