Share News

ప్రజలకు చేరువగా పంచాయతీరాజ్‌ సేవలు

ABN , Publish Date - Dec 05 , 2025 | 01:26 AM

డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయాల (డీడీవో) ఏర్పాటు ద్వారా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో పాలన మరింత మెరుగవుతుందని, ప్రజలకు సేవలు చేరువవుతాయని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పర్యవేక్షణ పెరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ అన్నారు.

ప్రజలకు చేరువగా పంచాయతీరాజ్‌ సేవలు

డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయ ప్రారంభోత్సవంలో కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిరప్రసాద్‌

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పెరగనున్న పర్యవేక్షణ

విశాఖపట్నం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి):

డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయాల (డీడీవో) ఏర్పాటు ద్వారా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో పాలన మరింత మెరుగవుతుందని, ప్రజలకు సేవలు చేరువవుతాయని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పర్యవేక్షణ పెరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ అన్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 77 డీడీవో కార్యాలయాలను ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ గురువారం చిత్తూరు నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. నగరంలో సూర్యాబాగ్‌లోని జీవీఎంసీ జోన్‌-4 కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన డీడీవో కార్యాలయ ప్రారంభోత్సవంలో దక్షిణ ఎమ్మెల్యే సీహెచ్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌తో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామీణ ప్రాంతంలోని భీమిలి, నగరంలోని జోన్‌-4 కార్యాలయంలో డీడీవో కార్యాలయాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ కార్యాలయాల ద్వారా గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇతర పథకాల అమలుపై పర్యవేక్షణకు మరింత వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ సంస్కరణల వల్ల పంచాయతీరాజ్‌ విభాగంలో ఎప్పుడు లేని విధంగా వేల సంఖ్యలో పదోన్నతులు లభించాయన్నారు. దీంతో వారంతా ఉత్సాహంతో ప్రజలకు సేవచేసే అవకాశం లభించిందన్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చొరవ తీసుకుని పంచాయతీరాజ్‌లో పెనుమార్పులు తీసుకువచ్చారని, దీనివల్ల ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు లభించాయన్నారు. కొత్తగా ఏర్పాటుచేసిన డీడీవో వ్యవస్థ వల్ల పది వేల మంది ఉద్యోగులు/అధికారులకు పదోన్నతులు లభించాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్‌, విశాఖ డీడీవో ఉషారాణి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ శ్రీనివాసరావు, ఇతర అధికారులు , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 01:26 AM