Share News

ఆక్రమణలో పంచాయతీ స్థలాలు

ABN , Publish Date - Sep 26 , 2025 | 12:47 AM

స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలతో పట్టణంలోని పలు లేఅవుట్లలో సర్వే చేసి పంచాయతీ స్థలాలను గుర్తిస్తున్న అధికారులు.. పంచాయతీ స్థలాల్లో ఇళ్లు, దుకాణాలు నిర్మించుకున్న వారిని మాత్రం ఖాళీ చేయించడంలేదు. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై పత్రికల్లో కథనాలు వస్తే.. ఆయా స్థలాలను స్వాధీనం చేసుకుంటామని అధికారులు ప్రకటించడమే తప్ప, అమలు చేయడంలేదు.

ఆక్రమణలో పంచాయతీ స్థలాలు
విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఆనుకుని పంచాయతీ స్థలంలో నిర్మించిన ఇల్లు

‘పేటలో దర్జాగా ఇళ్లు, దుకాణాల నిర్మాణం

ఏళ్ల తరబడి సాగుతున్నా.. పట్టించుకోని వైనం

విజిలెన్స్‌ విచారణకు హోం మంత్రి ఆదేశాలు

అయినా స్పందించని పంచాయతీ అధికారులు

పాయకరావుపేట, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలతో పట్టణంలోని పలు లేఅవుట్లలో సర్వే చేసి పంచాయతీ స్థలాలను గుర్తిస్తున్న అధికారులు.. పంచాయతీ స్థలాల్లో ఇళ్లు, దుకాణాలు నిర్మించుకున్న వారిని మాత్రం ఖాళీ చేయించడంలేదు. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై పత్రికల్లో కథనాలు వస్తే.. ఆయా స్థలాలను స్వాధీనం చేసుకుంటామని అధికారులు ప్రకటించడమే తప్ప, అమలు చేయడంలేదు.

పాయకరావుపేట పంచాయతీలో ఇప్పటి వరకు వేసిన 60 లేఅవుట్లలో రెండు మినహా మిగిలినవన్నీ వీఎంఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా వేసినట్టు అధికారులు గుర్తించారు. లేఅవుట్లకు పంచాయతీ నుంచి అనుమతులు తీసుకున్న సమయంలో సామాజిక అవసరాల నిమిత్తం విడిచిపెట్టిన స్థలాలుగా ఒక్కొక్కటిగా అన్యాక్రాంతం అవుతున్నాయి. ఈ స్థలాలను ఆయా లేఅవుట్లు వేసిన వ్యక్తులు అమ్ముకోవడం లేదా అన్యులు ఆక్రమించుకోవడం జరుగుతున్నాయి. వీటిపై పత్రికల్లో కథనాలు వస్తున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం రాజుగారిబీడులోని పంచాయతీ స్థలంలో ఇతరు ప్రహరీగోడ కడుతున్న వైనంపై మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఆమె ఆదేశాలతో పంచాయతీ అధికారులు ప్రహరీగోడను తొలగించారు. అంతేకాక పట్టణంలోని పలు లేఅవుట్లలో పంచాయతీకి దఖలుపడిన స్థలాల క్రయవిక్రయాలపై ఫిర్యాదులు వస్తుండడంతో మంత్రి అనిత మరోసారి స్పందించారు. అక్రమ లేఅవుట్లు, పంచాయతీ స్థలాల ఆక్రమణలపై విజిలెన్స్‌ విచారణకు అదేశిస్తున్నట్టు ప్రకటించారు. జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు స్థానిక పంచాయతీ అధికారులు పట్టణంలోని పలు లేఅవుట్లలో పంచాయతీ స్థలాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే పలు లేఅవుట్లలో పంచాయతీకి దఖలుపడిన స్థలాలను ఆక్రమించడంతోపాటు వాటిలో దర్జాగా ఇళ్లు, దుకాణాలు నిర్మించుకున్నారు. స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఆనుకుని గతంలో వేసిన లేఅవుట్‌లో పంచాయతీకి దఖలుపడిన సుమారు 200 గజాల స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించడంతోపాటు రేకులతో పక్కా నిర్మాణం చేపట్టి నివాసం వుంటున్నారు. రాజుగారిబీడులోని సందప్ప చెరువు పుంతరోడ్డును ఆనుకుని గతంలో వేసిన లేఅవుట్‌లో పంచాయతీకి దఖలుపడిన స్థలంలో ఒక కుటుంబం పాక నిర్మించుకుని వుంటున్నది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురితం కావడంతో పంచాయతీ అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు తప్ప పాక తొలగించలేదు. సాయిఆదర్శనగర్‌లో వేసిన లేఅవుట్‌లో నేరెళ్ల కాలువను ఆనుకుని పంచాయతీకి కేటాయించిన స్థలాన్ని ఆక్రమించి, పక్కా నిర్మాణం జరిగిన వైనంపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో అప్పటి పంచాయతీ ఈఓ స్పందించి, స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. కానీ ఆ స్థలంలో పక్కా ఇంటి నిర్మాణం జరగ్గా, దీనికి పంచాయతీ అధికారులు ఇంటి పన్ను కూడా వేశారు.

పంచాయతీరాజ్‌ శాఖ అతిథిగృహం ఎదుట సర్వే నంబర్‌ 132/3బిలో 1985లో వేసిన లేఅవుట్‌లో ప్రజోపయోగం కోసం కేటాయించిన 408 గజాల స్థలంలో సగం కబ్జాకు గురైంది. మిగిలిన స్థలంలో ఓ వ్యక్తి సిమెంట్‌ తూరలు తయారు చేసుకుంటూ పంచాయతీకి నామమాత్రంగా అద్దె చెలిస్తున్నారు. చిత్రమందిర్‌ థియేటర్‌ ఎదుటి వీధిలో పంచాయతీకి చెందిన సుమారు పది సెంట్ల స్థలంలో పాత ఇనుము కొట్టు వ్యాపారం సాగిస్తున్న వ్యక్తి పంచాయతీకి ఒక్క రూపాయి కూడా చెల్లించడంలేదు. దీనిపై పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి కె.డేవిడ్‌ని వివరణ కోరగా.. లేఅవుట్లలో వున్న పంచాయతీ స్థలాలను గుర్తించి బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పంచాయతీ స్థలాల్లో నిర్మాణాల విషయాన్ని వీఎంఆర్డీఏ అధికారుల దృష్టికి తీసుకెళతామని, తదుపరి చర్యలు వారే తీసుకుంటారని ఆయన తెలిపారు.

Updated Date - Sep 26 , 2025 | 12:47 AM