నేడు ఎలమంచిలిలో పంచరాత్రుల తీర్థమహోత్సవం
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:16 AM
పంచరాత్రుల తీర్థ మహోత్సవానికి ఎలమంచిలి ముస్తాబైంది. శనివారం రాత్రి పట్టణంలోని తులసీనగర్ ప్రాంతంలో జరగనున్న ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తులు రానుండడంతో నిర్వాహకులు భారీఎత్తున ఏర్పాట్లు చేశారు. భూలోకమాంబ అమ్మవారి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో శనివారం ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలు ప్రారంభం అవుతాయి.
తులసీనగర్, పాతవీధి ప్రాంతాల్లో భారీ ఎత్తున ఏర్పాట్లు
ఆకట్టుకుంటున్న విద్యుద్దీపాల సెట్టింగులు
ఎలమంచిలి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పంచరాత్రుల తీర్థ మహోత్సవానికి ఎలమంచిలి ముస్తాబైంది. శనివారం రాత్రి పట్టణంలోని తులసీనగర్ ప్రాంతంలో జరగనున్న ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తులు రానుండడంతో నిర్వాహకులు భారీఎత్తున ఏర్పాట్లు చేశారు. భూలోకమాంబ అమ్మవారి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో శనివారం ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలు ప్రారంభం అవుతాయి.
ఎలమంచిలి తులసీనగర్‌లోని భూలోకమాంబ అమ్మవారు, పాతవీధిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయల్లో దీపావళి రోజు నుంచి నాగుల చవితి వరకూ పంచరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవ కమిటీ చైర్మన్ అయిన విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనందకుమార్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీల ప్రతినిధుల పర్యవేక్షణలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దిమిలి ప్రధాన ద్వారం, తులసీనగర్ ప్రధాన ద్వారంతోపాటు ఆలయ పరిసరాల్లోని వీధుల్లో విద్యుద్దీపాల సెట్టింగులు పెట్టారు. భూలోకమాంబ ఆలయం చుట్టూ పసిడి వర్ణంలో ఏర్పాటు చేసిన సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గురవప్ప కల్యాణ మండపంలో చిన్నారుల ఆటవిడుపు కోసం జెయింట్‌వీల్, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి సాంస్కృతిక ప్రదర్శనల కోసం పలుచోట్ల స్టేజీలు నిర్మించారు. ఉత్సవానికి వేలాది మంది భక్తులు రానుండడంతో సీఐ ధనుంజయరావు, ఎస్‌ఐలు సావిత్రి, ఉపేంద్ర పర్యవేక్షణలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎలమంచిలిలో పంచరాత్రుల తీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. అడ్డరోడ్డు, రేగుపాలెం వైపు నుంచి ఎలమంచిలి వచ్చే వాహనాలను విజయలక్ష్మి పెట్రోలు బంకు సమీపంలో ఉన్న స్థలంలో, అనకాపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో, అచ్యుతాపురం, రాంబిల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు కల్కి పెట్రోలు బంకు పరిసరాల్లో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.