ఆయుష్ కేంద్రాల్లో పంచకర్మ వైద్యం
ABN , Publish Date - May 06 , 2025 | 01:10 AM
ప్రాచీన ప్రకృతి వైద్యానికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆయుష్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్ డిస్పెన్సరీల్లో ప్రాచీన పంచకర్మ వైద్యాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆయుర్వేద డిస్పెన్సరీలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా అభివృద్ధి చేస్తోంది.
ప్రాంతీయ కార్యాలయ పరిధిలో 23 చోట్ల అమలు
దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స
ఆరోగ్య మందిరాలుగా అభివృద్ధి చేస్తున్న కేంద్రం
విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి):
ప్రాచీన ప్రకృతి వైద్యానికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆయుష్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్ డిస్పెన్సరీల్లో ప్రాచీన పంచకర్మ వైద్యాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆయుర్వేద డిస్పెన్సరీలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా అభివృద్ధి చేస్తోంది.
ఆయుష్ విభాగం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 59 డిస్పెన్సరీలు ఉన్నాయి. వీటిలో 23 డిస్పెన్సరీలను ఆయుష్మాన్ ఆయుర్వేద మందిరాలుగా అభివృద్ధి చేయనున్నారు. వీటిలో దశల వారీగా పంచకర్మ వైద్య సేవలను అందుబాటులోకి తెస్తారు. ఇప్పటికే జోన్ పరిధిలోని అనకాపల్లి జిల్లా కొరుప్రోలు, విజయనగరం పట్టణం, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో పంచకర్మ వైద్య సేవలను అందిస్తున్నారు. మరికొద్దిరోజుల్లో మరో తొమ్మిది చోట్ల ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయుష్ ఆర్డీడీ ఝాన్సీ లక్షీబాయికి ఆదేశాలు అందాయి. శ్రీకాకుళం జిల్లాలోని పూండి, సింగుపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని బొండపల్లి, కోమటిపల్లి, బూర్జ, అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి, కన్నూరుపాలెం, నర్సీపట్నం కేంద్రాల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.
ఈ వ్యాధులకు వైద్యం..
పంచకర్మ వైద్యం అందించేందుకు సిబ్బందిని నియమించారు. మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో 23 ఆరోగ్య మందిరాలకు పురుష, మహిళా థెరపిస్ట్‌లను నియమించారు. పంచకర్మ వైద్యంలో వమనం, విరేచన, హస్తి, నస్య, రక్మమోచన అనే ఐదు రకాల చికిత్సతో వ్యాధులను నయంచేస్తారు. దీర్ఘకాలిక వ్యాధులకు కూడా సేవలందిస్తారు. ప్రధానంగా సొరియాసిస్, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పి, బొల్లి వ్యాధి, సైనసైటిస్, సయాటికా, పక్షవాతం వంటి వ్యాధులకు ఈ వైద్యం అందిస్తారని ఆర్డీడీ తెలిపారు.