Share News

పల్లా భవనం కూల్చివేత వ్యవహారం... ముగ్గురిపై వేటు

ABN , Publish Date - Jul 25 , 2025 | 01:07 AM

ప్రస్తుతం గాజువాక ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనం కూల్చివేతలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నాటి జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది.

పల్లా భవనం కూల్చివేత వ్యవహారం... ముగ్గురిపై వేటు

  • నాటి గాజువాక జోన్‌ డీసీపీ నరేందర్‌రెడ్డి, టీపీఓ వినయ్‌ప్రసాద్‌, టీపీఎస్‌ వరప్రసాద్‌ సస్పెన్షన్‌

  • అప్పటి సీసీపీ ఆర్జే విద్యుల్లత, సిటీప్లానర్‌ ప్రభాకర్‌, జెడ్సీ శ్రీధర్‌కు షోకాజ్‌

  • 2019 డిసెంబరు 21వ తేదీ తెల్లవారుజామున నిర్మాణంలో ఉన్న కాంప్లెక్స్‌ కూల్చివేత

  • జాతీయ రహదారి విస్తరణకు తగిన స్థలం వదలలేదని వాదన

  • నాటి వైసీపీ పెద్దల ఒత్తిడికి తలొగ్గారని విమర్శలు

విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి):

ప్రస్తుతం గాజువాక ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనం కూల్చివేతలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నాటి జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. రాజకీయ పలుకుబడికి తలొగ్గి దౌర్జన్యంగా యంత్రాలతో భవనాన్ని కూల్చివేయడంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి గాజువాక జోన్‌ డీసీపీ నరేందర్‌రెడ్డి, టీపీఓ వినయ్‌ప్రసాద్‌, టీపీఎస్‌ వరప్రసాద్‌పై సస్పెన్షన్‌ వేటు వేస్తూ రాష్ట్ర మునిసిపల్‌ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే అప్పటి చీఫ్‌ సిటీ ప్లానర్‌ ఆర్జే విద్యుల్లత, సిటీ ప్లానర్‌ ఎ.ప్రభాకరరావు, జోనల్‌ కమిషనర్‌ శ్రీధర్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీచేసింది.

జాతీయ రహదారిని ఆనుకుని గాజువాక సర్వే నంబర్లు 5/1, 5/3లో ఉన్న 864.33 చదరపు మీటర్ల స్థలంలో సెల్లార్‌+జీ+4 నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు 2019 డిసెంబరు 21న ఆన్‌లైన్‌లో ప్లాన్‌ (ప్లాన్‌ నంబర్‌ బీఏ నంబర్‌1086/3055/బి/జెడ్‌5/జీఏడీ/2019) తీసుకున్నారు. దీని ప్రకారం భవన నిర్మాణ పనులు చేపడుతుండగా, అప్పటి వైసీపీ పెద్దలు రాజకీయ దురుద్దేశంతో భవనాన్ని కూల్చివేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. దీంతో అప్పటి కమిషనర్‌ సృజన, చీఫ్‌ సిటీప్లానర్‌ ఆర్జే విద్యుల్లత ఆదేశాలతో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు 2021 ఏప్రిల్‌ 25న అర్ధరాత్రి యంత్రాలతో భవనం వద్దకు చేరుకున్నారు. మాస్టర్‌ప్లాన్‌లో జాతీయ రహదారిని 266 అడుగులకు విస్తరించాలనే ప్రతిపాదన ఉందని, ఆ మేరకు స్థలాన్ని విడిచిపెట్టకుండా భవన నిర్మాణం చేస్తున్నారంటూ అప్పటికప్పుడు నోటీసుని గోడకు అతికించి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కూల్చివేత ప్రారంభించారు. ఉదయం ఆరు గంటలయ్యేసరికి భవనం నేలమట్టం చేసి వెళ్లిపోయారు. తన భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా, రాజకీయ పలుకుబడికి తలొగ్గి కూల్చివేశారంటూ అప్పటి ప్రభుత్వానికిౖ పల్లా శ్రీనివాసరావు ఫిర్యాదుచేశారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని పల్లా కోరారు. దీంతో మునిసిపల్‌ మంత్రి పి.నారాయణ స్పందించి రాష్ట్రస్థాయి అధికారులతో విచారణ జరిపించగా, రాజకీయ కక్షతోనే భవనం కూల్చివేశారని, అధికారులు నిబంధనల ప్రకారం రెండుసార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదని, అర్ధరాత్రి సమయంలో భవనం కూల్చివేతలు చేపట్టకూడదని చట్టంలో ఉన్నప్పటికీ పట్టించుకోలేదని నివేదిక అందజేశారు. దీంతో అప్పటి గాజువాక డీసీపీ (ఇప్పుడు సీఆర్‌డీఏలో ఉన్నారు) నరేందర్‌రెడ్డి, అప్పటి గాజువాక టీపీఓ (ప్రస్తుతం ఇచ్చాపురం మునిసిపాలిటీలో టీపీఓగా ఉన్నారు) వినయ్‌ప్రసాద్‌, అప్పటి టీపీఎస్‌ (ప్రస్తుతం పలాస టీపీఓగా ఉన్నారు) వరప్రసాద్‌లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అప్పటి చీఫ్‌ సిటీప్లానర్‌, ప్రస్తుతం రాష్ట్ర టౌన్‌ అండ్‌ కంటీప్లానింగ్‌ డైరెక్టర్‌ ఆర్జే విద్యుల్లత, అప్పటి సిటీ ప్లానర్‌, ప్రస్తుతం సీసీపీగా ఉన్న ప్రభాకరరావు, అప్పటి గాజువాక జోన్‌ కమిషనర్‌, ప్రస్తుతం సెక్రటేరియట్‌లో ఉన్న శ్రీధర్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. భవనం కూల్చివేతలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందున ఎందుకు చర్యలు తీసుకోకూడదో 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే తన భవనం కూల్చివేశారని ఇప్పుడు రుజువైందన్నారు. తాను నిబంధనల ప్రకారమే భవనం నిర్మించానని, ఒకవేళ ఉల్లంఘనలు ఉంటే నోటీసులు ఇచ్చి తన సమాధానం తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలకు వెళ్లాలి తప్ప, అర్ధరాత్రివేళ నోటీసు అంటించి వెంటనే కూల్చివేయడం దారుణమన్నారు. రాజకీయ పలుకుబడికి తలొగ్గి అధికారులు నిబంధనలను పక్కనపెట్టేయడం సరికాదన్నారు. తాను పట్టుబడితే అప్పటి కమిషనర్‌ సృజనకు నోటీసులు ఇవ్వడంతోపాటు సీసీపీ విద్యుల్లతను కూడా సస్పెండ్‌ చేయవచ్చునన్నారు. ఇప్పటికైనా అధికారులు రాజకీయాలకతీతంగా పనిచేయాలని సూచించారు.

Updated Date - Jul 25 , 2025 | 01:07 AM