ఉద్యోగుల వసతి గృహాల్లో పాగా
ABN , Publish Date - Oct 16 , 2025 | 11:32 PM
ఐటీడీఏ ఆధ్వర్యంలో సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ఉద్యోగుల కోసం నిర్మించిన వసతి గృహాలు పరుల పరమయ్యాయి. బదిలీపై వెళ్లిపోయిన ఉద్యోగులు తమ గృహాలను వేరొకరికి అప్పగించకపోవడంతో అవి అన్యాక్రాంతమయ్యాయి.
కొయ్యూరు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ ఆధ్వర్యంలో సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ఉద్యోగుల కోసం నిర్మించిన వసతి గృహాలు పరుల పరమయ్యాయి. బదిలీపై వెళ్లిపోయిన ఉద్యోగులు తమ గృహాలను వేరొకరికి అప్పగించకపోవడంతో అవి అన్యాక్రాంతమయ్యాయి. ఈ వసతి గృహాల పరిస్థితిపై గతంలో ఉన్నతాధికారులు నివేదిక కోరగా, ఇవన్నీ శిథిల స్థితిలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అయితే ఆ ఇళ్లల్లోనే బయట వ్యక్తులు నివాసం ఉండడం గమనార్హం.
ఐదు దశాబ్దాల క్రితం మండల కేంద్రాల్లో అద్దె ప్రాతిపదికన అధికారులు నివాసం ఉండేందుకు సరైన వసతులు గల ఇళ్లు దొరికేవి కావు. దీంతో అధికారులు స్థానికంగా నివాసం ఉండేవారు కాదు. దీని వలన ప్రభుత్వ సేవలకు అంతరాయం కలిగేది. దీనిని గ్రహించిన ఐటీడీఏ అధికారులు వసతి గృహ సముదాయాలు నిర్మించాలని నిర్ణయించారు. మండలంలో పని చేసే ఉద్యోగుల కోసం నాలుగు దశాబ్దాల క్రితం రాజేంద్రపాలెం- శింగవరం గ్రామాల మధ్య ప్రభుత్వ స్థలంలో మూడు టైపుల్లో సుమారు 50 చొప్పున వసతి గృహాలను ఐటీడీఏ నిర్మించింది. మండల స్థాయి అధికారులకు ‘ఏ’ టైపు, సిబ్బందికి ‘బీ’ టైపు, సబార్డినేట్ స్థాయి వారికి ‘సీ’ టైపుగా నిర్దేశించి అప్పట్లో లక్షలాది రూపాయల వ్యయంతో వసతి గృహాలను నిర్మించింది. ‘ఏ’ టైపు క్వార్టరుకు రూ.400లు, ‘బీ’ టైపు క్వార్టరుకు రూ.300లు, ‘సీ’ టైపునకు రూ.250లు అద్దెగా నిర్ణయించి ఉద్యోగులకు అప్పగించింది. కొంత కాలం వరకు ఈ వసతి గృహాలు ఏ అధికారికి కేటాయిస్తే వారి ఆధీనంలో ఉండేవి. ప్రతీ నెల ఐటీడీఏకు అద్దె సక్రమంగా చెల్లిస్తూ స్థానికంగా ఉండి విధులు నిర్వర్తించేవారు. కాలక్రమేణా వచ్చిన అధికారులు బదిలీపై వెళ్లిపోవడం, కొత్తగా వచ్చిన అధికారులకు ఆ ఇల్లు అప్పగించకపోవడంతో సమస్య మొదలైంది. వసతి లేక కొత్తగా వచ్చిన అధికారులు సమీప మైదాన ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించేవారు. ఈ వసతి గృహాల గురించి ఐటీడీఏ పీవోలు పట్టించుకోకపోవడంతో ఆక్రమణకు గురయ్యాయి. ‘ఏ’ టైపు క్వార్టర్లు 12, ‘బీ’ టైపు 28, ‘సీ’ టైపు 12 ఆక్రమణల పాలయ్యాయి. కొంతకాలం ‘సీ’ టైపు క్వార్టర్లలో మంప, కొయ్యూరు పోలీస్ స్టేషన్లు కొనసాగగా, స్టేషన్లకు చెందిన సిబ్బంది కొందరు ‘బీ’, ‘సీ’ టైపు క్వార్టర్లలో నివాసం ఉండేవారు. కొన్ని ‘బీ’ టైపు క్వార్టర్లలో చిన్న తరహా నీటిపారుదలశాఖ సబ్ డివిజన్ కార్యాలయం నిర్వహించేవారు. అలాగే కొందరు జీసీసీ సిబ్బంది నివాసం ఉండేవారు. ఇక ‘ఏ’ టైపు క్వార్టర్లలో అప్పట్లో పని చేసి బదిలీపై వెళ్లిపోయిన మండల స్థాయి అధికారులతో సన్నిహితంగా మెలిగిన వారు ఆ వసతి గృహాలను ఆక్రమించుకున్నారు. పోలీస్ స్టేషన్లకు కొత్త భవనాలు నిర్మించడం, సిబ్బందికి ఆ శాఖ వసతి గృహాలు నిర్మించడంతో వారు కూడా వీటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో గ్రామానికి చెందిన కొందరు ఈ వసతి గృహాలను ఆక్రమించుకుని స్వల్ప మరమ్మతులు చేసి అద్దెకు ఇస్తుండేవారు. అయితే ఆ తరువాత ఆ గృహాలను వేరొకరికి విక్రయించేశారు. ఐటీడీఏ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ వసతి గృహాలు పూర్తిగా పరుల పరమయ్యాయి.
రికార్డుల్లో శిథిలం.. గృహాల్లో నివాసం
సుమారు దశాబ్దం క్రితం అప్పటి ఐటీడీఏ పీవో ఈ వసతి గృహాల పరిస్థితిని పూర్తిగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అయితే అధికారులు ఈ గృహాలన్నీ శిథిలావస్థలో ఉన్నాయని నివేదిక ఇచ్చారు. కానీ ఈ గృహాల్లో ఇప్పటికీ ఆక్రమణదారులు దర్జాగా నివాసముంటున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ పీవో స్పందించి ఈ వసతి గృహాలపై దృష్టి సారించి మరమ్మతుల అనంతరం మండల స్థాయి అధికారులకు కేటాయిస్తే ఐటీడీఏకి ఆదాయం సమకూరుతుందని పలువురు అంటున్నారు. అలాగే అధికారులు అందుబాటులో ఉంటారని చెబుతున్నారు.