దేదీప్యమానంగా పద్మనాభుని దీపోత్సవం
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:33 AM
అనంత పద్మనాభుని దీపోత్సవం బుధవారం సాయంత్రం కన్నులపండువగా జరిగింది. ఏటా కార్తీక బహుళ అమావాస్య రోజున నిర్వహించే ఈ ఉత్సవానికి ఈ ఏడాది భక్తులు భారీగా తరలివచ్చారు.
పోటెత్తిన భక్తులు
పద్మనాభం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):
అనంత పద్మనాభుని దీపోత్సవం బుధవారం సాయంత్రం కన్నులపండువగా జరిగింది. ఏటా కార్తీక బహుళ అమావాస్య రోజున నిర్వహించే ఈ ఉత్సవానికి ఈ ఏడాది భక్తులు భారీగా తరలివచ్చారు. చలిని కూడా లెక్క చేయకుండా వేకువజామునే పద్మనాభం చేరుకుని మెట్లకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకుంటూ గిరిని అధిరోహించారు. అక్కడ అనంత పద్మనాభుడిని దర్శించుకున్నారు. అనంతరం కొండ దిగువన కుంతీమాధవస్వామి, నారాయణేశ్వరస్వామి, మత్స్యమూర్తి ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ రాలేమని భావించిన కొందరు ఉదయాన్నే మెట్లపై దీపాలను వెలిగించేశారు.
కుంతీమాధవస్వామి ఆలయం నుంచి సాయంత్రం నాలుగు గంటల సమయంలో శ్రీదేవి, భూదేవ సమేత అనంతపద్మనాభుని ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన గరుడ వాహనంపై నిలిపి తప్పెటగుళ్లు, పులివేషాలు, కోలాటం బృందాల ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా తొలి పావంచా వద్దకు తీసుకువచ్చారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5.30 గంటలకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వామివారికి పూజలు చేశారు. అనంతరం తొలి పావంచాల వద్ద జేగంట కొట్టగానే భక్తులు మెట్లపై అప్పటికే సిద్ధం చేసుకున్న దీపాలను ఒక్కసారిగా వెలిగించారు. దీంతో ఆ ప్రాంతమంతా దేదీప్యమానమైంది. కొండపైన, దిగువన భక్తులకు దాతలు ఉచితంగా ప్రసాదాలు పంపిణీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీ ఆదేశాల మేరకు నార్త్‌జోన్ ఏసీపీ అప్పలరాజు ఆధ్వర్యంలో సుమారు 500 మంది పోలీసులు ట్రాఫిక్ నియంత్రణతోపాటు, శాంతిభద్రతలు, ఇతర బందోబస్తు పనులు చేపట్టారు. కమాండ్ కంట్రోల్ ఏర్పాటుచేసిన పోలీసులు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా ఉత్సవం మొత్తాన్ని పర్యవేక్షించారు. ఉత్సవానికి సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయన ఎమ్మెల్యే గంటాతో కలిసి తొలి పావంచా వద్ద స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గాడు వెంకటప్పడు, టీడీపీ సీనియర్ నాయకులు దామోదరరావు, నగేష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.