Share News

డ్రమ్‌ సీడర్‌తో వరినాట్లు

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:16 PM

సుమారు నెల రోజుల నుంచి జిల్లాలో సరైన వర్షాలు పడకపోవడంతో వర్షాధార భూములు, చెరువుల ఆయకట్టు కింద భూముల్లో వరినాట్లు జాప్యం అయ్యేలా వున్నాయి. ఇప్పటికే పోసిన ఆకుమడుల్లో వరినారు ఎండిపోతున్నది.

డ్రమ్‌ సీడర్‌తో వరినాట్లు
డ్రమ్‌సీడర్‌ ద్వారా వరి విత్తనాలు విత్తుతున్న దృశ్యం.(ఫైల్‌ ఫోటో)

తక్కువ నీటి వినియోగంతో పంట సాగు

ఎకరాకు 12-18 కిలోల విత్తనం చాలు

వరుసలు, మొక్కల మధ్య నిర్ణీత దూరం

మందులతో కలుపు బెడద నివారణ

సాధారణ పద్ధతితో పోలిస్తే నీరు, సమయం ఆదా

పది రోజుల ముందుగానే కోత

30 శాతం అధికంగా ధాన్యం దిగుబడి

బీసీటీ కేవీకే సేద్య శాస్త్రవేత్త డాక్టర్‌ వానా ప్రసాదరావు

రాంబిల్లి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): సుమారు నెల రోజుల నుంచి జిల్లాలో సరైన వర్షాలు పడకపోవడంతో వర్షాధార భూములు, చెరువుల ఆయకట్టు కింద భూముల్లో వరినాట్లు జాప్యం అయ్యేలా వున్నాయి. ఇప్పటికే పోసిన ఆకుమడుల్లో వరినారు ఎండిపోతున్నది. దీంతో రానున్న వారం రోజుల్లో వర్షాలు కురిసినా.. ఆయా ప్రాంతాల్లో వరినారు అందుబాటులో వుండదు. ఇటువంటి సమస్యను అధిగమించి, యథావిధిగా వరి సాగు చేయడానికి డ్రమ్‌ సీడర్‌ విధానం దోహదపడుతుందని హరిపురం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం సేద్య శాస్త్రవేత్త డాక్టర్‌ వానా ప్రసాదరావు చెప్పారు. డ్రమ్‌ సీడర్‌ ద్వారా వరి విత్తనాలు వేయడం, కలుపు నివారణ, ఎరువుల వినియోగం గురించి ఆయన తెలిపిన వివరాలు..

ఎకరాకు 12-18 కిలోల విత్తనం అవసరం. ప్రత్యేకంగా ఫలానా రకం విత్తం వాడాలని లేదు. నేలలకు అనువైన రకాన్ని విత్తుకోవచ్చు. కిలో విత్తనానికి ఒక గ్రాము చొప్పున బావిస్టిన్‌ పొడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఒక లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున బావిస్టిన్‌ పొడిని కలిపి, అందువల్ల వరి విత్తనాలు పోసి 24 గంటలపాటు నానబెట్టాలి. తరువాత విత్తనాలను వడకట్టి, మంచినీటితో కడిగి, గోనె సంచిలో పోసి మూత కట్టాలి. దీనిని ఒక రోజుపాటు అలాగే వుంచాలి. సన్నరకాలు అయితే 12 గంటలు సరిపోతుంది. ఈలోగా డ్రమ్‌ సీడర్‌తోపాటు విత్తనం వేయడానికి పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. బంక నేలలో దమ్ము చేసిన మరుసటిరోజు విత్తుకోవచ్చు. విత్తనం వేసే సమయానికి పొలంలో నీరు లేకుండా బురదగా ఉంటే చాలు. ఇసుక నేలలు అయితే విత్తుకొనే రోజే ఆఖరి దమ్ము చేసి పలుచటి నీటిపొర ఉండేటట్టు చూసుకోవాలి.24 గంటలపాటు మండె కట్టిన (గోనె సంచిలో వుంచిన) విత్తనాన్ని డ్రమ్‌ సీడర్‌లో నింపి మూత బిగించాలి. విత్తనాలు సులువుగా రాలడానికి ప్రతి డ్రమ్‌లో 3/4 వంతు మాత్రమే విత్తనాలు నింపాలి. పొలంలో డ్రమ్‌ సీడర్‌ లాగుతూ విత్తనాలు వేసుకోవాలి. ఎనిమిది వరుసలు, వరుసకు వరుసకు మధ్య 20 సెంటీమీటర్లు, కుదురుకు కుదురుకు మధ్య ఐదు సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు పడతాయి. ఒక్కో కుదురుకు 3-5 గింజలు పడతాయి. ఈ పద్ధతిలో విత్తడానికి ఎకరాకు రెండు గంటలు పడుతుంది. ఒకరు డ్రమ్‌ లాగడానికి, మరోకరు డ్రమ్‌లో విత్తనాలు నింపడానికి.. ఇద్దరు వ్యక్తులు అవసరం అవుతారు. ఇద్దరు వ్యక్తులు ఒక రోజులో మూడు నుంచి నాలుగు ఎకరాల్లో డ్రమ్‌ సీడర్‌ ద్వారా వరి విత్తనాలు వేసుకోవచ్చు.

ఎరువుల యాజమాన్యం

ఆకు మడుల్లో నారును పెంచి, ప్రధాన పొలంలో నాటే పద్ధతిలో ఏయే ఎరువులు, ఎంతెంత మోతాదులో వేస్తారో, డ్రమ్‌ సీడర్‌ విధానంలో కూడా అంతే మొత్తం ఎరువులు వాడుకోవాలి. పూర్తి భాస్వరం, సగం పొటాష్‌ ఎరువును ఆఖరి దమ్ములో వేయాలి. మిగతా సగం పోటాష్‌ను అంకుర దశలో వేయాలి.

కలుపు నివారణ

వరి విత్తనాలను బురద నేలల్లో నేరుగా విత్తనం వల్ల వరితోపాటు కలుపు విత్తనాలు కూడా మొలకెత్తుతాయి. అందువల్ల విత్తిన 35-40 రోజుల వరకు కలుపు బెడద లేకుండా చూసుకోవాలి. విత్తిన 3-5 రోజుల మధ్య ఆక్సాడయార్జిల్‌ 35 గ్రాములు లేదా బ్యుటాక్టోర్‌ 500 మిల్లీ లీటర్ల మందును 20 కిలోల పొడి ఇసుకలో కలిపి ఎకరా విస్తీర్ణంలో చల్లాలి. విత్తిన 20-25 రోజులకు కోనో వీడర్‌ని నడపాలి. దీని వల్ల వరుసల మధ్యలో మొలిచిన కలుపు మొక్కలు తిరగబడి మట్టిలో కలిసిపోతాయి. విత్తిన 60 రోజుల తరువాత కలుపు సమస్య అధికంగా ఉంటే సైహలోపాస్‌ బ్యుటైల్‌ అనే మందును పది లీటర్ల నీటికి 40 మిల్లీలీటర్ల చొప్పున కలిపి కలుపు మొక్కలపైన మాత్రమే పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అవసరం మేరకు కూలీలతో ఒక్కసారి కలుపు తీయించుకోవాలి.

నీటియాజమాన్యం

విత్తనం వేసిన్పటి నుంచి పొట్ట దశ వరకు పొలంలో నీరు నిల్వ ఉంచకుండా కేవలం తడిగా ఉండేటట్టు చూసుకోవాలి. వేర్లు ఆరోగ్యవంతంగా పెరిగి మొక్కలు ఎక్కువ పిలకలు పెడతాయి.పైరు పొట్టదశ నుంచి పంట కోయడానికి పది రోజుల ముందు వరకు పొలంలో రెండు సెంటీ మీటర్ల లోతున నీరు నిల్వ ఉండేటట్టు చూసుకోవాలి.

సస్యరక్షణ చర్యలు

సాధారణ పద్ధతిలో వరి సాగుతో పోల్చుకుంటే డ్రమ్‌ సీడర్‌ విధానంలో చీడపీడల తాకిడి తక్కువ ఉంటుంది. గాలి, వెలుతురు బాగా ప్రసరించడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ ప్రక్రియలో కొంతమంది రైతులు పొలానికి నీరు పెట్టకుండా, బెట్టకు గురిచేస్తుంటారు. దీనివల్ల ఆకుముడత పురుగు, సుడిదోమ, కాండంతొలుచు పురుగు ఆశించే అవకాశం వుంది. వీటి నివారణ కోసం వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించి క్రిమి సంహారక మందులను పిచికారీ చేయాలి. సాధారణ పద్ధతితో పోలిస్టే డ్రమ్‌ సీడర్‌ విధానంలో వారం నుంచి పది రోజులు ముందుగానే పంట కోతకు వస్తుంది. పైగా 30 శాతం వరకు దిగుబడి పెరుగుతుంది. మరింత సమాచారం కోసం 89784 51144 నంబర్‌కు ఫోన్‌ చేసి సంప్రదించాలని శాస్త్రవేత్త వానా ప్రసాదరావు కోరారు.

Updated Date - Aug 11 , 2025 | 11:16 PM