Share News

పేదరికాన్ని రూపుమాపేందుకు పీ-4

ABN , Publish Date - Jul 06 , 2025 | 01:06 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ-4 విధానం అమలు కోసం అందరం కలిసి ముందుకునడుద్దామని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ కోరారు.

పేదరికాన్ని రూపుమాపేందుకు పీ-4

  • జిల్లాలో 73 వేల కుటుంబాలు గుర్తింపు

  • వారిని మార్గదర్శకులకు అనుసంధానం చేస్తాం

  • స్వర్ణాంధ్ర సాధనకు సంకల్పంతో ముందుకు నడుద్దాం

  • జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో కమిటీలు

  • ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌

విశాఖపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ-4 విధానం అమలు కోసం అందరం కలిసి ముందుకునడుద్దామని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ కోరారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ సమాజంలో దిగువస్థాయిలో ఉన్న 20 శాతం ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసి, పేదరికం లేని వ్యవస్థను స్థాపిద్దామని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా పీ-4 విధానం అమలు చేస్తున్నారన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మంది ప్రజలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులు ముందుకు రావాలన్నారు. కార్యక్రమం పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన ఏర్పాటుకానున్న కమిటీకి చైర్మన్‌గా పార్లమెంటు సభ్యుడు,సభ్య కార్యదర్శిగా కలెక్టర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉంటారన్నారు. నియోజకవర్గ కమిటీకి ఎమ్మెల్యే చైర్మన్‌గా, స్పెషల్‌ ఆఫీసర్‌ సభ్య కార్యదర్శిగా, వివిధ శాఖల అఽధికారులు సభ్యులుగా ఉంటారన్నారు.

పీ-4 విధానం అమలు కోసం జిల్లాలో 73 వేల కుటుంబాలను గుర్తించామని, వారిని మార్గదర్శకులకు అనుసంధానం చేస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రతి సచివాలయంలో పది మంది మార్గదర్శకులను గుర్తిస్తామన్నారు. మార్గదర్శి, పీ-4 ఫౌండేషన్‌ అమలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామన్నారు. పరస్పర సహకారం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునన్నారు. తద్వారా పేదరికాన్ని జయించాలన్నారు. ఇందుకు ప్రభుత్వ యంత్రాంగం తొలుత సాయం అందించాలని, ఆ తరువాతే మిగిలిన వర్గాల నుంచి సాయం తీసుకోవాలన్నారు. పీ-4 కోసం మరోసారి సర్వే చేస్తామన్నారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పలు సూచనలు చేశారు. సమావేశంలో ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, సీహెచ్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌, పి.విష్ణుకుమార్‌రాజు, పంచకర్ల రమేష్‌బాబు, వీఎంఆర్‌డీఎ చైర్మన్‌ ఎం.ప్రణవ్‌గోపాల్‌, డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 01:06 AM