Share News

రెవెన్యూ రికార్డుల నిర్వహణపై ఆగ్రహం

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:12 PM

విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. గురువారం ఆమె మండలంలో విస్తృతంగా పర్యటించారు.

రెవెన్యూ రికార్డుల నిర్వహణపై ఆగ్రహం
పెదబయలు తహశీల్దార్‌ కార్యాలయంలో చిందరవందరగా ఉన్న రికార్డులను పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో శ్రీపూజ

ఉద్యోగుల తీరుపై ఐటీడీఏ పీవో మండిపాటు

బంగారుమెట్ట బాలికల ఆశ్రమ పాఠశాల టీచర్ల పని తీరుపై అసహనం

విధులకు హాజరుకాని పీహెచ్‌సీ అంబులెన్స్‌ డ్రైవర్‌కు షోకాజు నోటీసు

పెదబయలు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. గురువారం ఆమె మండలంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత మండలంలోని అరడకోట టీడబ్ల్యూ బాలుర పాఠశాలను సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి ప్రామాణిక విద్య సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. వివిధ సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. జవాబులు చెప్పిన ఇద్దరు విద్యార్థులకు పెన్నులు బహూకరించారు. ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం పెదబయలు తహశీల్దార్‌ కార్యాలయాన్ని, ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. రెవెన్యూ కార్యాలయంలో రికార్డులు భద్రపరిచే గదిలో రికార్డులు చిందరవందరగా పడి ఉండడాన్ని గమనించి తహశీల్దార్‌, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ రికార్డులను పరిశీలించి నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై మండిపడ్డారు. వారం రోజుల్లో రికార్డులు సరిచేయాలని తహశీల్దార్‌ త్రినాథరావుకు ఆదేశించారు. ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో పీవో సందర్శన సమయంలో అంబులెన్స్‌ డ్రైవర్‌ లేకపోవడంతో ఫోన్‌ చేశారు. ఫోన్‌కు కూడా స్పందించకపోవడంతో షోకాజ్‌ నోటీసు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ముంచంగిపుట్టు మండలం కించాయిపుట్టు ఆంగన్‌వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరడంతో ఓ ఇంట్లో సెంటర్‌ నిర్వహణ జరుగుతుండడాన్ని పరిశీలించి ప్రభుత్వ పాఠశాల భవనం మరమ్మతులు చేసి అందులో అంగన్‌వాడీ కేంద్రం నిర్వహించాలని ఆదేశించారు. తిరుగు ప్రయాణంలో బంగారుమెట్ట పంచాయతీ కేంద్రంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించారు. విద్యార్థినుల పఠనా సామర్థ్యాన్ని పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థినుల పరీక్ష పేపర్లను నిశితంగా పరిశీలించి కాపీయింగ్‌ జరిగిందని గమనించి వాటిని సక్రమంగా దిద్దలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల పనితీరుపై మండిపడ్డారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, మళ్లీ తాను సందర్శించినప్పుడు విద్యారుల పఠనా సామర్థ్యం మెరుగుపడి ఉండాలన్నారు. ఆమె వెంట పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల అధికారులు ఉన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 11:12 PM