అక్రమార్కులు బరితెగింపు
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:16 AM
జిల్లాలో మైనింగ్ అక్రమార్కులు బరితెగించారు. ఎటువంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేసి నల్లరాయిని దర్జాగా అమ్ముకుంటున్నారు. మైనింగ్ అధికారుల కళ్లుగప్పి అనుమతులకు మించి, పరిధి దాటి రాయి తవ్వకాలు చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు సామగ్రి వినియోగించి బోరు బ్లాస్టింగ్‌లకు పాల్పడుతున్నారు. మొత్తం మీద నల్లరాయి, రోడ్డు మెటల్, కంకరను దోచుకుంటూ ప్రభుత్వానికి రాయల్టీ, జీఎస్‌టీ చెల్లించడం లేదు.

అనుమతులు లేకుండానే రాయి క్వారీలు నిర్వహణ
బోరు బ్లాస్టింగులతో పేలుళ్లు
బండరాళ్లు, రోడ్డు మెటల్, కంకర తరలింపు
ఒక వే బిల్లుపై పదుల సంఖ్యలో టిప్పర్లలో రాయి రవాణా
రాయల్టీ, జీఎస్‌టీ ఎగవేత
గనుల శాఖ విజిలెన్స్ తనిఖీలు బేఖాతరు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో మైనింగ్ అక్రమార్కులు బరితెగించారు. ఎటువంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేసి నల్లరాయిని దర్జాగా అమ్ముకుంటున్నారు. మైనింగ్ అధికారుల కళ్లుగప్పి అనుమతులకు మించి, పరిధి దాటి రాయి తవ్వకాలు చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు సామగ్రి వినియోగించి బోరు బ్లాస్టింగ్‌లకు పాల్పడుతున్నారు. మొత్తం మీద నల్లరాయి, రోడ్డు మెటల్, కంకరను దోచుకుంటూ ప్రభుత్వానికి రాయల్టీ, జీఎస్‌టీ చెల్లించడం లేదు.
జిల్లాలోని రాంబిల్లి మండలంలో నేవీ ప్రత్యామ్నాయ ఆపరేషన్ బేస్ (ఎన్‌ఏవోబీ) ఏర్పాటు అవుతున్న విషయం తెలిసిందే. సముద్ర తీరంలో జెట్టీ నిర్మాణానికి, బ్రేక్ వాటర్స్ కోసం భారీ ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు పెద్ద పరిమాణంలో వుండే బండరాళ్ల అవసరం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న అనకాపల్లి, నర్సీపట్నం, నాతవరం, రోలుగుంట, మాకవరపాలెం, చోడవరం, మాడుగుల, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో రాయి క్వారీల నిర్వాహకులు (చాలా వరకు అనుమతులు లేకుండా..), నేవల్ బేస్ పనులకు బండరాళ్ల సరఫరా కోసం సంబంధిత కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆయా మండలాల్లోని క్వారీల నుంచి నిత్యం వందలాది టిప్పర్లలో బండరాళ్లను తరలిస్తున్నారు.
జిల్లాలో గునుల శాఖ అనుమతి వున్న రాయి/కంకర క్వారీలు 60 మాత్రమే ఉన్నాయి. కానీ ఒక్క అనకాపల్లి డివిజన్‌లోనే ఎటువంటి అనుమతులు కేకుండా 150కిపైగా క్వారీలు నడుస్తున్నాయి. అనకాపల్లి మండలంలోని మార్టూరు, మామిడిపాలెం, మాకవరం, ఊడేరు, కుంచంగి, కూండ్రం పరిసరాల్లో అనుమతి లేని రాయి క్వారీలు పదుల సంఖ్యలో ఉన్నాయి. నర్సీపట్నం డివిజన్‌లో నర్సీపట్నం, నాతవరం, రోలుగుంట, మాకవరపాలెం, చోడవరం, మాడుగుల, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో కూడా కంకర క్వారీలు అక్రమంగా నడుస్తున్నాయి.
బోరు బ్లాస్టింగులు!
జిల్లాలో ఏ ఒక్క క్వారీలో కూడా బోరు బ్లాస్టింగులకు (డ్రిల్లింగ్ యంత్రంతో కొండపై వరుసగా పెద్ద పెద్ద రంధ్రాలు పెట్టి, వాటిల్లో మందుగుండు సామగ్రిని పెట్టి పేలుస్తారు.) అనుమతులు లేవు. కానీ అత్యధిక క్వారీల నిర్వాహకులు యథేచ్ఛగా పేలుడు సామగ్రి వినియోగిస్తున్నారు. ఒక్కసారి పేలుడు నిర్వహిస్తే కనీసం వంద లారీలకు తక్కువ కాకుండా రాయి అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల క్వారీల నిర్వాహకులకు కూలీల ఖర్చు బాగా తగ్గుతుంది. ఈ తరహా పేలుళ్లను గతంలోనూ నిర్వహించారు.. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత కూడా నిర్వహిస్తూనే వున్నారు. అధికారంలో ఏ పార్టీ వున్నప్పటికీ, క్వారీల నిర్వాహకుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
ఒకే వే బిల్లుతో పలువాహనాల్లో రాయి రవాణా
రాయి లేదా కంకర రవాణా చేసే లారీలు తప్పనిసరిగా వే బిల్లు వుండాలి. అయితే ఒకే వే బిల్లుతో పదుల సంఖ్యలో లారీలతో బండరాళ్లను తరలించుకుపోతున్నారు. అనకాపల్లి మండలంలోని మార్టూరు, మామిడిపాలెం, ఊడేరు, హెచ్‌ఎన్‌ఆర్ అగ్రహారం, మాకవరం, కుంచంగి, కూండ్రం, రొంగలివానిపాలెం గ్రామాల పరిధిలోని క్వారీల నుంచి నిత్యం వందల సంఖ్యలో టిప్పర్లు, లారీల్లో బండరాళ్లను తరలిస్తున్నారు. ఒకటి, రెండు ప్రముఖ సంస్థల పేరున ఉన్న లీజు పత్రాల ఆధారంగా నకిలీ వేబిల్లులతో అనధికార క్వారీల నుంచి కంకర, నల్లరాయి రవాణా చేస్తున్నారు. గనులు, రవాణా, పోలీసు శాఖల తనిఖీలు నామమాత్రం కావడం, కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు అండగా వుండడంతో అక్రమ క్వారీల నిర్వాహకుల వ్యాపారం మూడు టిప్పర్లు, ఆరు లారీల చందంగా సాగిపోతున్నది. స్థానికులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. గనుల శాఖ విజిలెన్స్, ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు అప్పుడప్పుడు క్వారీల్లో తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని వాహనాలను స్వాధీనం చేసుకొని మొక్కుబడిగా అపరాధ రుసుం విధించి వదిలేస్తున్నారు. అక్రమంగా తరలిపోతున్న దానిలో అధికారులు పట్టుకుంటున్నది పట్టుమని పది శాతం కూడా వుండడంలేదు.
గనుల శాఖ విజిలెన్స్, ఎన్‌ఫోర్సుమెంట్ విభాగం ఏడీ అశోక్‌కుమార్ ఇటీవల అనకాపల్లి మండలంలోని పలు క్వారీల్లో తనిఖీలు నిర్వహించి, రాయి తరలిస్తున్న 14 లారీలను స్వాధీనం చేసుకున్నారు. కుంచంగి, కూండ్రం, మార్టూరు, మామిడిపాలెం, మాకవరం పరిసరాల్లో పలు కంకర క్వారీలను సీజ్ చేశారు. ఇది జరిగి వారం రోజులు గడవక ముందే అవే క్వారీల్లో బోరు బ్లాస్టింగులు, కంకర, బండరాళ్ల అక్రమ రవాణా యథావిధిగా సాగిపోతున్నది.
రాయల్టీ, జీఎస్‌టీ ఎగవేత
అనుమతి పొందిన క్వారీల్లో క్యూబిక్ మీటరు నల్లరాయి తవ్వితే ప్రభుత్వానికి రూ.90 లేదా టన్నుకు రూ.60 వంతున రాయల్టీ చెల్లించాలి. ప్రతి క్యూబిక్ మీటరు బండరాయికి 5 శాతం జీఎస్‌టీని వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాలి. అయితే అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్వారీల నుంచి ప్రభుత్వానికి రాయల్టీ, జీఎస్‌టీ రావడంలేదు.