‘ఉక్కు’ సమ్మెపై తర్జన భర్జన
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:51 AM
అఖిలభారత కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వచ్చే నెల 9న దేశవ్యాప్తంగా తలపెట్టనున్న జాతీయ కార్మిక సమ్మెలో భాగంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మిక సమ్మె చేపట్టడంపై నాయకులు తర్జనభర్జన పడుతున్నారు.
కార్మిక సంఘాల మల్లగుల్లాలు
ఇప్పటికే యాజమాన్యానికి నోటీసు
ఉక్కుటౌన్‌షిప్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి):
అఖిలభారత కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వచ్చే నెల 9న దేశవ్యాప్తంగా తలపెట్టనున్న జాతీయ కార్మిక సమ్మెలో భాగంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మిక సమ్మె చేపట్టడంపై నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే ఉక్కు యాజమాన్యానికి నోటీసు ఇవ్వడంతో సమ్మెకు వెళ్తామని కొంద రు నేతలు చెబుతుండగా మరిన్ని సంఘాలు నిరసనకు పరిమితమవుదామని సూచిస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ప్లాంట్ బ్లాస్ట్‌ఫర్నేస్ -3 పునఃప్రారంభం కానుండడంతో సమ్మె చేస్తే ఎదురయ్యే పరిణామాలపై కార్మిక సంఘాలు ఆలోచనలో పడ్డాయి. ఈ దశలో సమ్మె తప్పదని కొన్ని కార్మిక సంఘాలు ప్రతిపాదిస్తుండగా, ఈ సమయంలో సమ్మె వద్దని, ఇప్పటికే ప్లాంట్‌లో విభిన్న పరిస్థితులున్నాయని, సమ్మె చేస్తే మరిన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని మరికొన్ని కార్మిక సంఘాలు పేర్కొన్నట్టు సమాచారం. ఇదిలావుండగా కొన్ని కార్మిక సంఘాలు సమ్మె వద్దని, జాతీయ సంఘాలు పిలుపునిచ్చిన క్రమంలో కేవలం నిరసన తెలుపుదామని ప్రతిపాదించారు. కాగా సమ్మె చేస్తేనే యాజమాన్యం దిగోస్తుందని, కార్మిక సమస్యలు పరిష్కరిస్తుందని తక్కువ మంది పేర్కొనగా, మెజారిటీ సంఘ నాయకులు దానికి అంగీకరించలేదని తెలిసింది. ఈ అంశంలో మరోసారి సమావేశమై సముచిత నిర్ణయం తీసుకుంటామని కార్మిక నాయకులు తెలిపారు.
అమరావతికి పయనమైన కలెక్టర్, ఎమ్మెల్యేలు
నేడు జరగే సుపరిపాలనలో తొలి అడుగు సమావేశానికి హాజరు
విశాఖపట్నం, జూన్ 22 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తియిన సందర్భంగా సోమవారం అమరావతిలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ హాజరుకానున్నారు. గత ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టు, ప్రస్తుత ఏడాదిలో లక్ష్యాలపై చర్చించనున్న సమావేశంలో జిల్లాకు సంబంధించి వివరాలు వెల్లడించనున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు గాను కలెక్టర్ హరేంధిరప్రసాద్, ఎమ్మెల్యేలు అమరావతికి పయనమయ్యారు.
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
విశాఖపట్నం/వెంకోజీపాలెం, జూన్ 22 (ఆంధ్రజ్యోతి):
ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కారవేదిక నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎంఎన్. హరేంధిరప్రసాద్ తెలిపారు. ఉదయం 9.30 గంటకు అర్జీల స్వీకరణ ప్రారంభిస్తామన్నారు. 1100 నంబరుకు ఫోన్‌చేసి వినతులు నమోదుచేసుకోవచ్చునన్నారు. కాగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు అన్ని జోనల్ కార్యాలయాల్లో సోమవారం ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) జరుగుతుందని మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నగరవాసులు పారిశుధ్యం, పట్టణ ప్రణాళిక, మొక్కల విభాగం, రెవెన్యూ, యూసీడీ, ఇంజనీరింగ్ తదితర విభాగాల సమస్యలపై అర్జీలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు.