వైరల్ జ్వరాల విజృంభణ
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:23 PM
ప్రస్తుతం వాతావరణంలో మార్పులతో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీలో సుమారు రెండు నెలలుగా భిన్నమైన వాతావరణంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.
వాతావరణంలో మార్పులతో అనారోగ్యానికి గురవుతున్న జనం
ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో వైరల్ జ్వర బాధితులే అధికం
పాడేరు ప్రభుత్వాస్పత్రికి రోగుల తాకిడి
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ప్రస్తుతం వాతావరణంలో మార్పులతో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీలో సుమారు రెండు నెలలుగా భిన్నమైన వాతావరణంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళల్లో దట్టమైన పొగ మంచు, మధ్యాహ్నం వేళల్లో తీవ్రమైన ఎండ, సాయంత్రం వేళ భారీ వర్షం కురుస్తున్నది. దీంతో జనం వైరల్ జ్వరాల బారిన పడి ఆస్పత్రులకు వస్తున్నారు.
ప్రస్తుతం ఏజెన్సీలో విభిన్నమైన వాతావరణం కారణంగా జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వస్తున్నాయి. వైరల్ జ్వరం వస్తే మూడు నుంచి ఐదు రోజుల వరకు ఉంటోంది. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో జ్వరబాధితులే అధికంగా ఉంటున్నారు. పది మందిలో కనీసం ఆరుగురు జ్వరంతో బాఽధపడుతున్న వారే కనిపిస్తున్నారు. గత మూడు వారాలుగా వైరల్ జ్వరాల ప్రభావం అధికమైందని వైద్యులు అంటున్నారు. గతంలో స్థానిక జిల్లా ఆస్పత్రికి రోజుకు 300 నుంచి 400 మంది అవుట్ పేషెంట్‌లుగా వచ్చేవారు. ఆ సంఖ్య ప్రస్తుతం 550 నుంచి 650 వరకు పెరిగింది. అలాగే వారిలోనూ 60 శాతం మంది వైరల్ జ్వర బాధితులే ఉంటున్నారు. ఇదే పరిస్థితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కొనసాగుతున్నది. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా వైరల్ జ్వరాల ప్రభావమే అధికంగా కొనసాగుతున్నది.
పాడేరు ఆస్పత్రికి గత వారం రోజులుగా వచ్చిన రోగుల వివరాలు
తేదీ పురుషులు మహిళలు మొత్తం
8-9-2025 288 410 833
9-9-2025 218 297 627
10-9-2025 203 351 671
11-9-2025 193 325 639
12-9-2025 226 332 672
13-9-2025 174 212 465
14-9-2025 236 342 578