Share News

ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఆర్గానిక్‌ పద్ధతిలో పరిశోధనలు

ABN , Publish Date - May 14 , 2025 | 11:26 PM

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పరిశోధనలు ఆర్గానిక్‌ పద్ధతిలో నిర్వహించాలని వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహామండలి(జడ్‌ఆర్‌ఈఏసీ) సమావేశాల్లో తీర్మానించామని స్థానిక సహపరిశోధన సంచాలకులు(ఏడీఆర్‌) డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.

ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఆర్గానిక్‌ పద్ధతిలో పరిశోధనలు
ఆర్‌ఏఆర్‌ఎస్‌లో సేంద్రీయ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తున్న దృశ్యం

రసాయన రహిత ప్రాంతంగా గిరిజన మండలాలు

జడ్‌ఆర్‌ఈఏసీ సమావేశంలో తీర్మానం

ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి

చింతపల్లి, మే 14 (ఆంధ్రజ్యోతి): ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పరిశోధనలు ఆర్గానిక్‌ పద్ధతిలో నిర్వహించాలని వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహామండలి(జడ్‌ఆర్‌ఈఏసీ) సమావేశాల్లో తీర్మానించామని స్థానిక సహపరిశోధన సంచాలకులు(ఏడీఆర్‌) డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్‌ 19న పార్వతీపురంలో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం పరిధి ఉన్నత పర్వతశ్రేణి గిరిజన మండలాలకు సంబంధించి 2025-26 ఖరీఫ్‌, రబీ కాలంలో చేపట్టాల్సిన పరిశోధన, విస్తరణ కార్యాచరణపై సమీక్ష నిర్వహించి పలు కీలక అంశాలపై తీర్మానాలు చేశామన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు గిరిజన మండలాలను రసాయన రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. తొలుత పరిశోధన స్థానంలో చేపట్టే పరిశోధనలు పూర్తిగా ఆర్గానిక్‌ పద్ధతిలో నిర్వహించి రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను పూర్తి స్థాయిలో నిషేధించాలని నిర్ణయించామని చెప్పారు. పరిశోధన స్థానంలో సాగు చేసే పంటలకు రసాయన ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయకుండా సేంద్రీయ పద్ధతుల్లో ఘన, ద్రవ జీవామృతం, కషాయలను వినియోగిస్తామన్నారు. ఈ పద్ధతులను రైతులకు పరిచయం చేస్తామన్నారు. రైతులు సేంద్రీయ ఎరువులు, కషాయాలు ఏ విధంగా సిద్ధం చేసుకోవాలనే అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. ప్రధానంగా వ్యవసాయ పంటలైన వరి, రాగి, సామ, కొర్ర, జొన్న, మొక్కజొన్న, రాజ్‌మా, వలిసెలు, కొమ్ముశనగ, వేరుశనగ పంటలతో పాటు ఉద్యాన వాణిజ్య పంటలైన కాఫీ, మిరియాలు, పసుపు, అల్లం, జీడిమామిడి పంటలను ఆర్గానిక్‌ పద్ధతిలో సాగు చేసేకునే పద్ధతులపై గిరిజన రైతులకు శిక్షణ ఇస్తామన్నారు. గిరిజన రైతులను క్రమంగా రసాయన ఎరువుల నుంచి పూర్తిగా దూరం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఉన్నత పర్వత శ్రేణి గిరిజన మండలాలు ఆర్గానిక్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.

Updated Date - May 14 , 2025 | 11:26 PM