సేంద్రీయ పద్ధతిలో రాజ్‌మా విత్తన శుద్ధి
ABN , Publish Date - Sep 07 , 2025 | 10:54 PM
ఆదివాసీ రైతులు సంప్రదాయేతర పంటగా సాగు చేస్తున్న రాజ్‌మా విత్తనాలను సేంద్రీయ పద్ధతిలో శుద్ధి చేయడంలో స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు విజయం సాధించారు.
మొలకెత్తే శాతం పెంపు, తెగుళ్లు నియంత్రణ
విత్తనాలు భద్రపరిచేందుకు ప్రత్యేక బ్యాగ్‌లు
మూడేళ్లుగా ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు విజయవంతం
చింతపల్లి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ రైతులు సంప్రదాయేతర పంటగా సాగు చేస్తున్న రాజ్‌మా విత్తనాలను సేంద్రీయ పద్ధతిలో శుద్ధి చేయడంలో స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు విజయం సాధించారు. సేంద్రీయ పద్ధతిలో విత్తన శుద్ధి చేయడం వలన విత్తనాల్లో మొలకెత్తే శాతం పెరగడంతో పాటు తెగుళ్లను తట్టుకుంటున్నాయని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా రుజువు చేశారు. విత్తనాలు పురుగు పట్టకుండా భద్రపరిచేందుకు ప్రత్యేక బ్యాగ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాలపై ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో ప్రత్యేక డాక్యుమెంటరీని విడుదల చేసింది.
దక్షిణ భారతదేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే రాజ్‌మా పండుతుంది. ఆదివాసీ రైతులు 45 ఏళ్లగా రాజ్‌మా పంటను సంప్రదాయేతర వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. 12 ఏళ్ల క్రితం వరకు ఆదివాసీ రైతులు సుమారు 45 వేల హెక్టార్లలో రాజ్‌మాను సాగుచేసేవారు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల కారణంగా కాలక్రమంగా గిరిజన ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. గత ఏడాది పాడేరు డివిజన్ పరిధిలో కేవలం పది వేల ఎకరాల్లో మాత్రమే రాజ్‌మా సాగు చేపట్టారు. ఈ ఏడాది 9,800 హెక్టార్లలో సాగు చేపట్టేందుకు అవసరమైన 4,900 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తున్నారు. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో మాత్రమే గరిష్ఠంగా ఆరు వేల హెక్టార్లతో రాజ్‌మా సాగు జరుగుతున్నది. ఆదివాసీ రైతులు చింతపల్లి రెడ్, వైట్ రకాలను సాగు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చింతపల్లి రెడ్ రకం విత్తనాలను పంపిణీ చేస్తున్నది. ఈ విత్తనాలకు సరైన విత్తన శుద్ధి చేయకపోవడం వలన మొలకెత్తే శాతం తక్కువగా ఉన్నది. తెగుళ్ల కారణంగా 20 శాతం మొక్కలు చనిపోతున్నాయి. దీంతో గిరిజన రైతులు ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నారు.
విత్తనాల్లో మొలకెత్తే శాతం పెంచేలా..
గిరిజన ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్గానిక్ హబ్‌గా ప్రకటించింది. ఆదివాసీ రైతులు సేంద్రీయ పద్ధతిలో మాత్రమే పంట సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఈ మేరకు రాజ్‌మా విత్తనాల శుద్ధిని సేంద్రీయ పద్ధతిలో చేపట్టేందుకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు మూడేళ్లగా పరిశోధనలు చేపట్టారు. ప్రధానంగా జీవామృతం, బీజామృతంతో ప్రత్యేక పద్ధతుల ద్వారా విత్తన శుద్ధి చేపట్టడం వలన విత్తనాల్లో మొలకెత్తే శాతాన్ని 95 శాతానికి శాస్త్రవేత్తలు పెంచారు. అలాగే పంటలో తెగుళ్లను సైతం నియంత్రించారు. సేంద్రీయ పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకునే పద్ధతులను విశ్వవిద్యాలయం ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందించింది.
విత్తనాలు భద్రపరిచేందుకు ప్రత్యేక బ్యాగ్‌లు
ఆదివాసీ రైతులు రాజ్‌మా విత్తనాలను సంప్రదాయ పద్ధతుల్లో నిల్వ చేస్తున్నారు. ప్రధానంగా విత్తనాలను బుట్టలు, కుండలు, గోనె సంచుల్లో నిల్వ చేస్తున్నారు. దీని వలన విత్తనం పురుగు పడుతుంది. దీంతో రైతులు విత్తన కొరత సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ‘హెర్మెటిక్’ బ్యాగ్‌లను రూపొందించారు. విత్తనాలను ఈ బ్యాగ్‌ల్లో ఏడు, ఎనిమిదేళ్ల వరకు ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకుండా భద్రపరుచుకోవచ్చు. ఈ బ్యాగ్‌లను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.