హాట్ కేకుల్లా ఆర్గానిక్ కమలాల విక్రయం
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:07 PM
మండలంలోని పనసపల్లి గ్రామంలో ఓ గిరిజన రైతు సాగు చేసిన ఆర్గానిక్ కమలాలు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి.
తోటలో అంతర పంటగా సాగు
ఎకరానికి ఏడాదికి రూ.2 లక్షల ఆదాయం పొందుతున్న గిరిజన రైతు
గూడెంకొత్తవీధి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పనసపల్లి గ్రామంలో ఓ గిరిజన రైతు సాగు చేసిన ఆర్గానిక్ కమలాలు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. కమలాల దిగుబడులు ప్రారంభం కావడంతో వర్తకులు, ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ కొనుగోలు చేసేందుకు తోట వద్ద క్యూ కడుతున్నారు. పనసపల్లి గ్రామానికి చెందిన గిరిజన రైతు పొత్తూరు ప్రసాద్ నాలుగు ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నాడు. ఒక ఎకరం కాఫీ తోటలో నీడ కోసం ఐదేళ్ల క్రితం కమలా పండ్ల మొక్కలు నాటాడు. గత ఏడాది నుంచి ఈ మొక్కలు దిగుబడినిస్తున్నాయి. ప్రస్తుతం కమలా మొక్కలు కాఫీ తోటకు నీడనివ్వడంతో పాటు దిగుబడులనిస్తున్నాయి. ఎకరం విస్తీర్ణంలో కమలా మొక్కలు నాటేందుకు రూ.15 వేలు ఖర్చు అయిందని రైతు చెబుతున్నాడు. గత ఏడాది కమలా పంట నుంచి రూ.2 లక్షల ఆదాయం వచ్చిందని, ఈ ఏడాది ఇంచుమించుగా అంతే ఆదాయం రావచ్చునని ఆయన తెలిపాడు. గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు కాఫీ తోటలో నీడ కోసం సిల్వర్, మారుజాతి మొక్కలను సాగు చేస్తూ మిరియాల పంటను పండిస్తున్నారు. ప్రసాద్ విభిన్నంగా కాఫీ తోటకు నీడనిచ్చేందుకు కమలా మొక్కలు నాటడం, ప్రస్తుతం దిగుబడులు ప్రారంభం కావడంతో ఒకే భూమిలో రెండు పంటలను తీస్తున్నాడు. కాయ పరిమాణం ఆధారంగా రైతు కిలో రూ.80 నుంచి రూ.100 ధరకు విక్రయిస్తున్నాడు.