సేంద్రీయ వ్యవసాయమే ధ్యేయం
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:34 AM
జిల్లాలో సంపూర్ణ సేంద్రీయ వ్యవసాయమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టాలని, ఆ లక్ష్యాన్ని 2028 నాటికి చేరాలని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ సూచించారు.
2028 నాటికి లక్ష్యం చేరాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ సూచన
ఎంత మంది సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారని ఆరా
351 మంది రైతులకు రూ.1.26 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలు పంపిణీ
పాడేరు, జూన్ 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సంపూర్ణ సేంద్రీయ వ్యవసాయమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టాలని, ఆ లక్ష్యాన్ని 2028 నాటికి చేరాలని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ సూచించారు. ఈ ఏడాది 50 శాతం రాయితీపై వ్యవసాయ పరికరాల పొందిన రైతులు, వ్యవసాయాధికారులతో బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ సచివాలయాల స్థాయిలో గిరిజన రైతులు ఏ మేరకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అవసరమవుతామనేది పక్కాగా సర్వే నిర్వహించాలన్నారు. ఎంత మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు?, పంటలకు యూరియా, పొటాషియం, పురుగుల మందులు ఎంత మంది వినియోగిస్తున్నారని రైతులను అడిగి తెలుసుకున్నారు. 50 శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలు ప్రభుత్వం అందిస్తుందని రైతులకు ఎలా తెలిసిందని ఆరా తీశారు. సేంద్రీయ వ్యవసాయంపై రైతులు సంపూర్ణ అవగాహన పెంచుకోవాలన్నారు. రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతంలో వ్యవసాయమంతా సేంద్రీయ పద్ధతుల్లోనే చేపట్టాలని ఆయన సూచించారు. పాడేరు ఏజెన్సీలో ఈ ఏడాది 30 వేల ఎకరాల్లో కాఫీ తోటల పెంపకానికి చర్యలు చేపడుతున్నామని, నీడ తోటలకు మద్ది, నేరేడు, పనస మొక్కలను రైతులకు ఉపాధి హామీ పథకంలో పంపిణీ చేస్తామన్నారు. భూములున్న రైతులు కాఫీ సాగును విస్తరించాలని కలెక్టర్ సూచించారు. రైతులకు అందించిన వ్యవసాయ యంత్ర పరికరాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతి సాధించాలన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు వరి విత్తనాలను పంపిణీ చేశారు.
రూ.1.26 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలు పంపిణీ
కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన 351 మంది రైతులకు రూ.కోటి 26 లక్షలు విలువైన వ్యవసాయ పరికరాలను 50 శాతం రాయితీపై ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పంపిణీ చేశామని కలెక్టర్ దినేశ్‌కుమార్ తెలిపారు. 95 మంది రైతులకు తైవాన్ స్ర్పేయర్లు, 29 మందికి ట్రాక్టర్లు, 59 మందికి పవర్ టిల్లర్లు, 13 మందికి బ్రెష్ కట్టర్లు, 155 మందికి పవర్ వీడర్లను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నంద్, అరకులోయ, పాడేరు ఏడీలు వి.మోహనరావు, ఝాన్సీలక్ష్మీ, ఎండీఎస్ శ్రీనివాస్, వివిధ వ్యవసాయ విభాగాల జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు జేవీ రామమోహనరావు, విజయకుమార్, ఎల్..భాస్కర రావు, మండల వ్యవసాయాధికారులు, గిరిజన రైతులు పాల్గొన్నారు.