సేంద్రీయ పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:08 PM
సేంద్రీయ పద్ధతిలో పంటలు పండించే గిరి రైతులకు లాభదాయకమైన గిట్టుబాటు ధర వచ్చేలా స్పైసీ బోర్డు, జయంతి సంస్థ కృషి చేయాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ సూచించారు.
గిరి రైతులకు లాభం చేకూర్చాలి
స్పైసీ బోర్డు సమావేశంలో కలెక్టర్ దినేశ్‌కుమార్ సూచన
అరకులోయ, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): సేంద్రీయ పద్ధతిలో పంటలు పండించే గిరి రైతులకు లాభదాయకమైన గిట్టుబాటు ధర వచ్చేలా స్పైసీ బోర్డు, జయంతి సంస్థ కృషి చేయాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ సూచించారు. అరకులోయలో స్పైసీ బోర్డు ఆధ్వర్యంలో స్పైసీ బోర్డు, జయంతి సంస్థ సంయుక్తంగా కాఫీ, మిరియాలు, అల్లం, పసుపు పండించే రైతులు, ఎఫ్‌పీసీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ సేంద్రీయ పద్ధతిలో రైతులు పండించే పంటలకు, ఎరువులు వేసి పండించే పంటలకు మధ్య ధరల్లో తేడా ఉండేలా చూడాలన్నారు. సేంద్రీయ పద్ధతిలో పండించే గిరి రైతుల ఉత్పత్తులను స్పైసీ బోర్డు ఆధ్వర్యంలో జయంతి సంస్థ నేరుగా కొనుగోలు చేసి రైతులకు లాభం వచ్చేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో జయంతి సంస్థ చీఫ్ కమర్షియల్ జనరల్ మేనేజర్ భవిక్‌దేశాయ్, ప్రొక్యూర్‌మెంట్ మేనేజర్ అరవింద్, మార్కెటింగ్ ప్రతినిధులు, స్పైసీ బోర్డు ఏవో కల్యాణి పాల్గొన్నారు.