ఆపరేషన్ లంగ్స్ 2.0
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:38 AM
నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటుచేసిన దుకాణాలు, అనధికార నిర్మాణాలను తొలగించేందుకు జీవీఎంసీ అధికారులు ‘ఆపరేషన్ లంగ్స్ 2.0’ను తిరిగి ప్రారంభించారు.
రోడ్ల మార్జిన్లు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు తిరిగి ప్రారంభం
ఎనిమిది జోన్‌లలో 336 ఆక్రమణలు తొలగింపు
విశాఖపట్నం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి):
నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటుచేసిన దుకాణాలు, అనధికార నిర్మాణాలను తొలగించేందుకు జీవీఎంసీ అధికారులు ‘ఆపరేషన్ లంగ్స్ 2.0’ను తిరిగి ప్రారంభించారు. ట్రాఫిక్ ఇబ్బందులకు రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలే కారణమని ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో శనివారం అధికారులు మళ్లీ రంగంలోకి దిగారు. జీవీఎంసీ పరిధిలోని ఎనిమిది జోన్‌లలో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ఖాళీస్థలాలను ఆక్రమించి అనధికారంగా ఏర్పాటుచేసిన దుకాణాలు, షెడ్‌లను తొలగించారు. జోన్-1 పరిధిలో అంబేడ్కర్ విగ్రహం నుంచి తగరపువలసలోని వైఎస్‌ఆర్ విగ్రహం వరకూ 15 ఆక్రమణలు, జోన్-2 పరిధిలో మారికవలస జంక్షన్ నుంచి బోయపాలెం రోడ్డు వరకూ, చంద్రంపాలెం ఉన్నత పాఠశాల వరకూ 40 ఆక్రమణలు, జోన్-3 పరిధి 18వ వార్డులో సమతా కాలేజీ సర్కిల్, ఏఎస్ రాజా కాలేజీ సర్కిల్‌లో 23 ఆక్రమణలు, జోన్-4లోని 31వ వార్డులో లీలామహల్ జంక్షన్ నుంచి సౌత్‌సెంట్రల్ జైలు వరకు 31 ఆక్రమణలను తొలగించారు. జోన్-5 పరిధిలోని 54, 55, 56, 57 వార్డుల్లో కంచరపాలెం నుంచి ఎన్‌ఏడీ జంక్షన్ వరకు 80 ఆక్రమణలు, జోన్-6 పరిధిలో శ్రీనగర్ నుంచి దుర్గానగర్ రోడ్డు, బీసీ రోడ్డు జంక్షన్ నుంచి గంగవరం పోర్టు రోడ్డు వరకూ 70 ఆక్రమణలను తొలగించారు. ఏడో జోన్ పరిధిలోని 82, 83 వార్డుల పరిధిలో నెహ్రూచౌక్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు 12 ఆక్రమణలు, జోన్-8 జోన్ పరిధిలో సుజాతానగర్ నుంచి ఎలక్ర్టికల్ ఆఫీస్ వరకు 30 ఆక్రమణలు తొలగించారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని చీఫ్ సిటీప్లానర్ ఎ.ప్రభాకరరావు తెలిపారు.