పర్యాటకానికి ఓపెన్ టాప్ బస్సు
ABN , Publish Date - Nov 05 , 2025 | 01:14 AM
వన్‌టౌన్‌లోని కనకమహాలక్ష్మి ఆలయంలో ఈ నెల 21 నుంచి ప్రారంభ కానున్న మార్గశిర మాసోత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ సూచించారు.
విశాఖపట్నం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి):
పర్యాటకుల కోసం మరో కొత్త బస్సు మంగళవారం నగరానికి వచ్చింది. ఇది డబుల్ డెక్కర్ ఓపెన్ టాప్ బస్సు. ఇంతకుముందు రెండు హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులు వచ్చిన సంగతి తెలిసిందే. అవి డబుల్ డెక్కర్ అద్దాల బస్సులు. ఇది కింద ఏసీతో అద్దాలతోను, పైన ఓపెన్ టాప్‌గా ఉంటుంది. బీచ్ రోడ్డులో ఇందులో ప్రయాణం కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ బస్సును విశాఖపట్నం పోర్టు అధికారులు సమకూర్చారని ఏపీటీడీసీ డివిజన్ మేనేజర్ జగదీశ్ ప్రసాద్ తెలిపారు. జిల్లా కలెక్టర్ నిర్ణయం ప్రకారం పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామన్నారు.
కనకమహాలక్ష్మి ఆలయంలో 21 నుంచి మార్గశిర మాసోత్సవాలు
భక్తుల రద్దీకి తగినట్టుగా ఏర్పాట్లు
నిర్ణీత సమయాల్లోనే వీవీఐపీలకు దర్శనాలు
దేవస్థానం అధికారులతో కలెక్టర్ సమీక్ష
విశాఖపట్నం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి):
వన్‌టౌన్‌లోని కనకమహాలక్ష్మి ఆలయంలో ఈ నెల 21 నుంచి ప్రారంభ కానున్న మార్గశిర మాసోత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ సూచించారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ అధికారులతో కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పక్కా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీస్ బందోబస్తును పెట్టుకొని ట్రాఫిక్ మళ్లింపు, వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించాలన్నారు. ప్రతి గురు, శుక్ర, శనివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా రోజులకు ప్రత్యేక ప్రణాళిక ఉండాలన్నారు. క్యూ లైన్లు, మంచినీటి సదుపాయం, వైద్య శిబిరాలు ఉండాలన్నారు. పోలీస్ అధికారుల సూచనల మేరకు సీసీ టీవీ కెమెరాలు పెట్టుకోవాలన్నారు. నిత్యాన్నదానం, ప్రసాదాల కౌంటర్లలో తగిన మంది సిబ్బందిని నియమించాలన్నారు. అన్ని విభాగాల అధికారులతో ఆలయం సమీపాన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రసాదాల నాణ్యతలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని హెచ్చరించారు. ప్రతి గురువారం ఆ మార్గంలో నడిచే ఆర్టీసీ బస్సుల రూట్‌ను మార్చాలని సూచించారు. ఏర్పాట్లపై ముందుగానే అన్ని శాఖల అధికారులు కలిసి జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేయాలన్నారు.
వైదిక కమిటీ నిర్ణయం మేరకు
భక్తులే నేరుగా అమ్మవారికి అభిషేకాలు చేసి, పుసుపు, కుంకుమలు సమర్పించే ఆచారంపై సమావేశంలో చర్చ జరిగింది. వారిని అలా అనుమతిస్తే రద్దీకి తగినట్టుగా దర్శనాలు కల్పించడం ఆలస్యం అవుతుందని ఈఓ శోభారాణి అన్నారు. భక్తులు తీసుకువచ్చిన పసుపు, కుంకుమలను ఉద్యోగులు, వలంటీర్లు తీసుకొని అమ్మవారికి సమర్పించేలా చూస్తామన్నారు. దీనిపై వైదిక కమిటీ సూచనలు తీసుకొని ఆ ప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్బంగా ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
కేటాయించిన సమయాల్లోనే దర్శనాలు: ఈఓ శోభారాణి
మార్గశిర మాసోత్సవాల్లో నాలుగు గురువారాలు (నవంబరు 27, డిసెంబరు 4, 11, 18 తేదీలు) వస్తాయని ఆ రోజుల్లో వీవీఐపీలు దర్శనాల కోసం కేటాయించిన సమయాల్లోనే రావాలని ఈఓ శోభారాణి సూచించారు. ఆయా రోజుల్లో తెల్లవారుజామున 2.30 గంటలకే దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. సాధారణ రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి దర్శనాలు ఉంటాయన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజూ జగన్నాథస్వామి ఆలయం వద్ద ఉదయం 11 గంటల నుంచి అన్నదాన వితరణ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఈఈ సీహెచ్‌వీ రమణ, ఏఈఓ రాజేంద్ర, పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
విశాఖ డీఎఫ్‌వోగా రవీంద్ర
విశాఖపట్నం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం డివిజనల్ అటవీ అధికారిగా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డీఎఫ్‌వో రవీంద్ర దామ (2017 ఐఎఫ్‌ఎస్‌బ్యాచ్) నియమితులయ్యారు. ఇక్కడ డీఎఫ్‌వోగా ఉన్న అనంతశంకర్‌ను గత ఏడాది ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ఇటీవల జూ క్యురేటర్ మంగమ్మకు అదనంగా డీఎఫ్‌వో బాధ్యతలు అప్పగించారు.