సమర్థులకే టీడీపీ పగ్గాలు
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:57 AM
తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా బత్తుల తాతయ్యబాబు, ప్రధాన కార్యదర్శిగా లాలం కాశీనాయుడు మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలో రెండు ప్రధాన సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చినట్టయ్యిందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా పాత వారికే అవకాశం
తాతయ్యబాబు, కాశీనాయుడు మరోసారి నియామకం
అనకాపల్లి రూరల్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా బత్తుల తాతయ్యబాబు, ప్రధాన కార్యదర్శిగా లాలం కాశీనాయుడు మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలో రెండు ప్రధాన సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చినట్టయ్యిందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. చోడవరం నియోజకవర్గం బుచ్చెయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన తాతయ్యబాబు 2006 నుంచి 2011 వరకు ఎంపీపీ పనిచేశారు. 2020లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, అదే సంవత్సరం చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి నియమితులయ్యారు. గత ఏడాది సాధారణ ఎన్నికల ముందు పార్టీ అధిష్ఠానం ఆయనను పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమించింది. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి విశేష కృషి చేశారు. తరువాత సుమారు ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌గా నియమించింది. ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షునిగా మరోసారి నియమితులయ్యారు. పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలానికి చెందిన సీనియర్‌నేత లాలం కాశీనాయుడును పార్టీ అధిష్ఠానం మరోసారి టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ సందర్భంగా తాతయ్యబాబు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, పార్టీ జిల్లా అధ్యక్షునిగా మరోసారి నియమితులైన తనపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. తనపై నమ్మకంపై ఈ పదవికి ఎంపికచేసిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులను సమన్వయం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపునకు కృషి చేస్తానని అన్నారు.
స్పీకర్ అయ్యన్నను కలిసిన తాతయ్యబాబు, కాశీనాయుడు
నర్సీపట్నం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు ఆదివారం నర్సీపట్నంలో స్పీకర్ క్యాంపు కార్యాలయానికి వచ్చి చింతకాయల అయ్యన్నపాత్రుడుని మర్యాదపూర్వంగా కలిశారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. వీరి వెంట ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ ఉన్నారు.