Share News

కౌన్సిల్‌లోకి సభ్యులకు మాత్రమే అనుమతి

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:47 AM

మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు అందజేసిన అవిశ్వాస తీర్మానం నోటీస్‌కు సంబంధించి ఈనెల 19న జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం జరగబోతుండడంతో రో అధికారులు, ఐడెంటిఫికేషన్‌ అధికారులతో ఇన్‌చార్జి కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌ గురువారం సమీక్ష నిర్వహించారు.

కౌన్సిల్‌లోకి సభ్యులకు మాత్రమే అనుమతి

  • మరెవరూ లోపలకు ప్రవేశించకుండా చూడాలి

  • అవిశ్వాస తీర్మానంపై 19నకౌన్సిల్‌ సమావేశం జరగనున్న నేపథ్యంలో రో, ఐడెంటిఫికేషన్‌ అధికారులతో జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌, కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ సమావేశం

  • సమావేశం మొత్తాన్ని వీడియా తీయించాలని ఆదేశం

  • 300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి):

మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు అందజేసిన అవిశ్వాస తీర్మానం నోటీస్‌కు సంబంధించి ఈనెల 19న జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం జరగబోతుండడంతో రో అధికారులు, ఐడెంటిఫికేషన్‌ అధికారులతో ఇన్‌చార్జి కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. సమావేశం జరిగే రోజు కేవలం వార్డు కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులను మాత్రమే లోపలకు అనుమతించాలని, సభ్యులను గుర్తించే బాధ్యత ఐడెంటిఫికేషన్‌ అధికారులదేనని కలెక్టర్‌ స్పష్టంచేశారు. గుర్తింపు కార్డులు పరిశీలించిన తర్వాత లోపలకు పంపించాలన్నారు. సభ్యులతో పాటు మరెవరూ లోపలకు రాకుండా ఐడెంటిఫికేషన్‌ అధికారులు చూడాలన్నారు. అందుకు అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. కౌన్సిల్‌ హాల్‌లోకి సభ్యులు ప్రవేశించినప్పుడు తమ సెల్‌ఫోన్‌లను ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టుకునేలా అధికారులు చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమైన తర్వాత కోరం సరిపోతే ఓటింగ్‌ ప్రారంభమవుతుందని, అప్పుడు చేతులెత్తే సభ్యుల సంఖ్యను లెక్కించే బాధ్యత రో అధికారులదేనని కలెక్టర్‌ వివరించారు. ఒక్కో రో అధికారి తమకు కేటాయించిన వరుసలో ఎంతమంది చేతులు ఎత్తారనేది పేర్లతో సహా నమోదుచేసుకుని, కార్యదర్శికి అందజేయాల్సి ఉంటుందని కలెక్టర్‌ వివరించారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలతోపాటు అదనంగా మరికొన్ని వీడియో కెమెరాలను కూడా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. సమావేశం ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

పటిష్ఠ భద్రత

కౌన్సిల్‌ సమావేశానికి పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 19వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి జీవీఎంసీ రఽపధాన కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. జీవీఎంసీ ఉద్యోగులు, వార్డు కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులను మినహా మిగిలిన వారు లోపలకు ప్రవేశించకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఉన్న సీఎంఆర్‌ బస్టాప్‌ నుంచి సంపత్‌ వినాయగర్‌ ఆలయానికి వెళ్లే రోడ్డు మినహా జీవీఎంసీ కార్యాలయం చుట్టూ ఉన్న రోడ్లను బారికేడ్లతో మూసివేయనున్నారు. ఆ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 210 మంది శాంతిభద్రతల విభాగం సిబ్బంది, 90 మంది ట్రాఫిక్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేయాలని పోలీస్‌ అధికారులు నిర్ణయించారు.

Updated Date - Apr 18 , 2025 | 12:47 AM