కొన్ని రూట్లలో అచ్చంగా మహిళా కండక్టర్లు
ABN , Publish Date - Jul 31 , 2025 | 01:06 AM
మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఉండే రూట్లలో మహిళా కండక్టర్లనే వినియోగించాలని ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
మహిళా ప్రయాణికులు
ఎక్కువగా ఉండే మార్గాల్లో
నడిచే బస్సుల్లో నియామకానికి
ఆర్టీసీ అధికారుల ఆలోచన
ద్వారకా బస్‌స్టేషన్, జూలై 30 (ఆంధ్రజ్యోతి):
మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఉండే రూట్లలో మహిళా కండక్టర్లనే వినియోగించాలని ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడు అన్ని రూట్లలోను మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగినా, కొన్ని రూట్లలో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. అలాంటి సందర్భాల్లో కండక్టర్లు మగవారైతే బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఇబ్బందిపడే అవకాశం ఉంది. మహిళల మధ్య నుంచి ముందుకు, వెనక్కు తిరిగేందుకు మగ కండక్టర్లు కూడా ఇబ్బందిగా ఫీలవుతారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అలాంటి రూట్లలో తిరిగే బస్సుల్లో మహిళా కండక్టర్లనే నియమించాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు.
సింహాచలం, కనకమహాలక్ష్మి ఆలయం, కలెక్టరేట్, కేజీహెచ్, ద్వారకా బస్ కాంప్లెక్స్, పూర్ణామార్కెట్, వీఎస్‌ఈజెడ్, విశాఖ రైల్వేస్టేషన్, దువ్వాడ రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాలకు ఎక్కువమంది మహిళలు వివిధ అవసరాల మీద బస్సుల్లో రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ రీజియన్‌లో 388 మహిళా కండక్టర్లు ఉండగా, వారిలో కనీసం 200 మందినైనా ఈ రూట్లలో షెడ్యూలింగ్ చేయాలని ఆలోచిస్తున్నారు.