Share News

కేకే లైన్‌లో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు

ABN , Publish Date - May 29 , 2025 | 11:53 PM

కొత్తవలస-కిరండూల్‌ (కేకే) లైన్‌లో అనంతగిరి మండలం తైడ-చిమిడిపల్లి స్టేషన్ల మధ్య బుధవారం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన సంఘటనలో పునరుద్ధరణ పనులు గురువారం కూడా కొనసాగాయి.

కేకే లైన్‌లో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు
కేకే లైన్‌లో పునరుద్ధరణ పనులు జరుగుతున్న దృశ్యం

పట్టాలు తప్పిన బోగీలను తొలగించే ప్రక్రియ వేగవంతం

నేటితో పనులు పూర్తయ్యే అవకాశం

అరకులోయ/అనంతగిరి, మే 29(ఆంధ్రజ్యోతి): కొత్తవలస-కిరండూల్‌ (కేకే) లైన్‌లో అనంతగిరి మండలం తైడ-చిమిడిపల్లి స్టేషన్ల మధ్య బుధవారం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన సంఘటనలో పునరుద్ధరణ పనులు గురువారం కూడా కొనసాగాయి. సుమారు 33 గూడ్స్‌ బోగీలు పట్టాలు తప్పడం, వీటిలో మూడు బోగీలు టన్నెల్‌లో పట్టాలు తప్పడంతో వాటిని తొలగించడం కష్టంగా ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. డీఆర్‌ఎం, ఏడీఆర్‌ఎం, ఇతర రైల్వే అధికారుల పర్యవేక్షణలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నాటికి పనులు పూర్తి కావచ్చని భావిస్తున్నారు. కాగా గురువారం కూడా పాసింజర్‌ రైలు, నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దయ్యాయి. రోజూ కిరండూల్‌ నుంచి విశాఖపట్నానికి గూడ్స్‌ రైళ్ల ద్వారా ఐరన్‌ ఓర్‌ తరలించే ప్రక్రియ నిలిచిపోయింది. పాసింజరు రైలు రద్దు కావడంతో పర్యాటకుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అరకులోయ, బొర్రా ప్రాంతంలో పర్యాటకుల సందడి తగ్గింది.

నేడు కిరండూల్‌ రైళ్ల సర్వీసులు రద్దు

విశాఖపట్నం: సాంకేతిక కారణాల వల్ల శుక్రవారం విశాఖ-కిరండూల్‌ (58501) రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్టు సీనియర్‌ డీసీఎం కె.కెందీప్‌ తెలిపారు. అలాగే తిరుగు ప్రయాణంలోని కిరండూల్‌-విశాఖ (58592) నంబరు గల పాసింజర్‌ రైలుతో పాటు కిరండూల్‌-విశాఖ (18516) నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును కూడా రద్దు చేసినట్టు వెల్లడించారు.

Updated Date - May 29 , 2025 | 11:53 PM