Share News

భూ దోపిడీపై సా..గుతున్న విచారణ

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:33 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు అడ్డగోలుగా సాగించిన ప్రభుత్వ భూముల దోపిడీపై కూటమి ప్రభుత్వం చేపట్టిన విచారణ నత్తనడకన సాగుతున్నది. ఏడాది దాటినప్పటికీ విచారణ నివేదికలను బహిర్గతం చేయకపోవడంతో, అక్రమార్కులపై చర్యలు చేపట్టకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిల్లో కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేటలో వందలాది ఎకరాల ప్రభుత్వ, డి.పట్టా భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ లేఅవుట్‌ వేయడం, అనకాపల్లి మండలంలో భూ సమీకరణ మాటున అనర్హులకు కోట్లాది రూపాయలు పరిహారంగా పంపిణీ చేయడం ప్రధానంగా చెప్పుకోవాలి.

భూ దోపిడీపై సా..గుతున్న విచారణ
విస్సన్నపేట ప్రభుత్వ భూముల్లో ప్రకృతి విధ్వంసానికి ఇదే సాక్ష్యం (ఫైల్‌ ఫొటో)

ఏడు నెలలు దాటినా వెల్లడికాని నివేదిక

వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున భూ అక్రమాలు

కశింకోట మండలం విస్సన్నపేటలో వందలాది ఎకరాల ప్రభుత్వ, డి.పట్టా భూములు ఆక్రమణ

వెంచర్‌ పేరుతో ప్రకృతి విధ్వంసం

అనకాపల్లి మండలంలో ల్యాండ్‌ పూలింగ్‌ మాటున అక్రమాలు

రెవెన్యూ రికార్డుల్లో బినామీల పేర్లు

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విజలెన్స్‌, సీఐడీతో విచారణకు ఆదేశం

ఇంతవరకు బహిర్గతం కాని నివేదిక

ల్యాండ్‌ పూలింగ్‌ బినామీలకు రూ.6 కోట్లు పరిహారంగా చెల్లింపు

తెరవెనుక కూటమి నేతలు చక్రం తిప్పినట్టు ఆరోపణలు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు అడ్డగోలుగా సాగించిన ప్రభుత్వ భూముల దోపిడీపై కూటమి ప్రభుత్వం చేపట్టిన విచారణ నత్తనడకన సాగుతున్నది. ఏడాది దాటినప్పటికీ విచారణ నివేదికలను బహిర్గతం చేయకపోవడంతో, అక్రమార్కులపై చర్యలు చేపట్టకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిల్లో కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేటలో వందలాది ఎకరాల ప్రభుత్వ, డి.పట్టా భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ లేఅవుట్‌ వేయడం, అనకాపల్లి మండలంలో భూ సమీకరణ మాటున అనర్హులకు కోట్లాది రూపాయలు పరిహారంగా పంపిణీ చేయడం ప్రధానంగా చెప్పుకోవాలి.

వైసీపీ అధికారంలో వున్నప్పుడు జిల్లాకు చెందిన ఓ మంత్రి, ఆయన అనుచరగణం అనకాపల్లి, కశింకోట, సబ్బవరం, పరవాడ మండలాల్లో ప్రభుత్వ, డి.పట్టా భూములను చెరబట్టినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అధికారాన్ని అడ్డంపెట్టుకుని కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేటలోని సుమారు 350 ఎకరాల వివాదాస్పద డి.పట్టా భూములు, ప్రభుత్వానికి చెందిన కొండ గోర్జిలు, వాగులు, వంకలను కబ్జా చేశారు. యంత్రాలను వినియోగించి ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు. వీఎంఆర్‌డీఏ నుంచి ఆనుమతులు తీసుకోకుండా.. ‘వింటేజ్‌ మౌంట్‌ వ్యాలీ రిసార్ట్‌’ పేరుతో వెంచర్‌ వేసి, విల్లాలు నిర్మించనున్నట్టు ఆకర్షణీయమైన బ్రోచర్లతో ఆర్భాటంగా ప్రచారం చేశారు. వీటిపై అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితం అయ్యాయి. జిల్లాస్థాయి అధికారులు స్పందించి, మొక్కుబడిగా విచారణ జరిపించి చేతులు దులుపుకున్నారు. మరోవైపు జనసేన నేత దూలం గోపి లోకాయుక్తను ఆశ్రయించడమే కాకుండా, పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విస్సన్నపేట గ్రామాన్ని సందర్శించిన జనసేన అధినేత.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత విస్సన్నపేటలో ప్రభుత్వ భూముల ఆక్రమణ, వైసీపీ నేతల భూ దందాపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక ప్రజాప్రతినిధుల వినతి మేరకు విస్సన్నపేట భూ కుంభకోణంపై విజిలెన్స్‌, సీఐడీ విచారణకు ఆదేశించారు. ఆయా అధికారులు ఇప్పటికే రెండు, మూడుసార్లు విస్సన్నపేట భూములను పరిశీలించారు. గ్రామంలో విచారణ జరిపి, వివరాలు సేకరించారు. ఇది జరిగి నెలలు గడిచినప్పటికీ విచారణ నివేదికను బహిర్గతం చేయలేదు. విస్సన్నపేట భూ ఆక్రమణదారులకు కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదు. విచారణ ఏ దశలో ఉందో అధికారులు సైతం వెల్లడించడం లేదు.

ల్యాండ్‌ పూలింగ్‌ మాటున అక్రమాలు

పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి భూ సమీకరణ కోసం వైసీపీ ప్రభుత్వం జీవో 72ను జారీ చేసింది. అప్పట్లో అనకాపల్లి మండలంలో 11 గ్రామాల్లో సుమారు 870 ఎకరాలను రైతుల నుంచి సమీకరించారు. భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా వీఎంఆర్‌డీఏ అభివృద్ధి చేసిన ప్లాట్‌లను కేటాయించారు. అయితే జిల్లాకు చెందిన ఒక మంత్రి అండదండలతో, వైసీపీ మండలస్థాయి నాయకులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై, భూములు ఇచ్చిన రైతుల జాబితాలో బినామీల పేర్లను చేర్చారు. ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములు ఇవ్వకుండానే వీఎంఆర్‌డీఏ అభివృద్ధి చేసిన ప్లాట్‌లను కాజేయాలని ప్రయత్నించారు. కోడూరు గ్రామంలో సర్వే నంబరు 20లో 39 ఎకరాల 38 సెంట్ల ప్రభుత్వ భూమిని అదే గ్రామంలో వైసీపీకి చెందిన తొమ్మిది కుటుంబాలకు చెందిన 34 మంది పేర్లను జాబితాలో చేర్చారు. దీనిపై నాడు ప్రతిపక్షంగా వున్న టీడీపీ, జనసేన పార్టీల నాయకులు ఆందోళనలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ జిల్లా కలెక్టర్‌కు, డీజీపీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలో వుండడం, అక్రమాలకు పాల్పడింది ఆ పార్టీ నేతలే కావడంతో విచారణ జరగలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో సాగించిన అక్రమాలపై విజిలెన్స్‌, సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. సీఐడీ అధికారి నాగేంద్ర భూపాల్‌ నేతృత్వంలో మూడు బృందాలు అనకాపల్లి, సబ్బవరం, పరవాడ తహసీల్దారు కార్యాలయాల్లో గత ఏడాది డిసెంబరులో తనిఖీలు నిర్వహించారు. అనకాపల్లి మండలం కోడూరు, కూండ్రం, కుంచంగి, మామిడిపాలెం గ్రామాల్లో ల్యాండ్‌పూలింగ్‌కు సంబంధించి పలు కీలక రికార్డులను స్వాధీనం చేసుకొని వెంట తీసుకెళ్లారు. దీంతో అక్రమార్కులపై త్వరలోనే చర్యలు ఉంటాయని అంతా భావించారు. ఇది జరిగి దాదాపు ఏడు నెలలు దాటింది. ల్యాండ్‌ పూలింగ్‌ అక్రమాలపై చేపట్టిన విచారణ ఏమైందో స్థానిక అధికారులకే తెలియని పరిస్థితి నెలకొంది. ఏయే రికార్డులు తీసుకెళ్లారో కూడా రెవెన్యూ అధికారుల వద్ద సమాచారం లేదు. మరోవైపు ల్యాండ్‌ పూలింగ్‌కు భూములు ఇవ్వకపోయినా.. జాబితాల్లో పేర్లు చేర్చిన బినామీ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లకు బదులు నగదు రూపంలో నష్టపరిహారం అందజేయడానికి పావులు కదిపారు. ఈ వ్యవహారంలో కూటమికి చెందిన ఒక పార్టీ నేతలు తెరవెనుక కథ నడిపించి, రెవెన్యూ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. కోడూరు గ్రామంలో 20వ సర్వే నంబరులో వున్న 39.38 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి గతంలో బినామీ రైతులుగా పేర్లు నమోదు చేసిన వ్యక్తులకు ఇటీవల సుమారు రూ.6 కోట్లు పరిహారంగా చెల్లించేశారు. వైసీపీ హయాంలో బినామీ రైతుల వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదులు చేయడమే కాకుండా ఆందోళనలు చేసిన టీడీపీ నాయకులు.. ఇప్పుడు నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ప్రభుత్వం, జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ఇప్పటికైనా విచారణ నివేదికలను బహిర్గతం చేసి, భూదోపిడీదారులపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 19 , 2025 | 12:33 AM