కొనసాగుతున్నవిమానాల రద్దు
ABN , Publish Date - Dec 10 , 2025 | 01:12 AM
విమాన సంస్థ ‘ఇండిగో’లో ఏర్పడిన సంక్షోభం కొనసాగుతోంది. విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన, ఇక్కడకు రావలసిన ఆ సంస్థ విమాన సర్వీసులన్నీ రద్దయిపోతున్నాయి.
గత వారం రోజులుగా ‘ఇండిగో’ సర్వీస్‌లన్నీ రద్దు
టూర్ క్యాన్సిల్ చేసుకుంటున్న బృందాలు
పర్యాటక సీజన్‌కు పెద్ద దెబ్బ
విశాఖపట్నం, అరకులోయల్లో హోటళ్లు, లాడ్జీలపై ప్రభావం ఎక్కువగా ఉందంటున్న ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.విజయమోహన్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విమాన సంస్థ ‘ఇండిగో’లో ఏర్పడిన సంక్షోభం కొనసాగుతోంది. విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన, ఇక్కడకు రావలసిన ఆ సంస్థ విమాన సర్వీసులన్నీ రద్దయిపోతున్నాయి. మంగళవారం కూడా ఎనిమిది ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఊహించని విధంగా విమానాలు రద్దు కావడం విశాఖపట్నంలో పర్యాటకం రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఇది పర్యాటక సీజన్. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రకృతి ప్రేమికులు ఏజెన్సీ అందాలు చూడడానికి వస్తుంటారు. దీనికోసం ముందుగానే విమానాలు, రైళ్లలో టికెట్లు బుక్ చేసుకుంటారు. వారి కోసం ఇక్కడి ట్రావెల్ ఏజెన్సీలు హోటళ్లలో రూమ్‌లు కూడా ముందుగానే బుక్ చేసి పెడతాయి. వారం క్రితం ఇండిగో సంస్థలో ఏర్పడిన సంక్షోభం వల్ల సర్వీసులు నిలిచిపోయాయి. ఢిల్లీ, చెన్నై కోల్‌కత్తా, ముంబై, భువనేశ్వర్, తిరుపతి వంటి ప్రాంతాల నుంచి విమాన టికెట్లు బుక్ చేసుకున్న పర్యాటకులు విశాఖపట్నం రాలేకపోతున్నారు. విదేశీ పర్యాటకులు కూడా ఢిల్లీ, చెన్నై, కోల్‌కత్తా, ముంబైల నుంచి కనెక్టింగ్ విమానాల్లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఇండిగో సేవలపై ఆధారపడిన వారంతా పర్యటనలు రద్దు చేసుకోవలసి వచ్చింది. ఆ టికెట్లే కాకుండా ఇక్కడ హోటళ్లలో రూమ్‌లు కూడా క్యాన్సిల్ చేయాల్సి వస్తోంది. ఇంకెన్ని రోజులు ఈ సంక్షోభం ఉంటుందో తెలియదు గానీ మంచి పర్యాటక సీజన్‌పై గట్టి దెబ్బే కొట్టిందని ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.విజయమోహన్ ఆవేదన వ్యక్తంచేశారు. ముంబై, ఢిల్లీల నుంచి కనెక్టింగ్ విమానాల ద్వారా డిసెంబరు 10-15 తేదీల మధ్య విశాఖపట్నం రావలసిన పలు బృందాలు ఇండిగో నిర్వాకం వల్ల ఆగిపోయాయని, దాని ద్వారా తాము నష్టపోయామన్నారు. విశాఖపట్నం, అరకులోయల్లోని హోటళ్లు, లాడ్జీలపై కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం 21 విమానాలే రాకపోకలు
విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఇండిగో, స్పైస్ జెట్, జెట్ ఎయిర్‌వేస్/జెట్ లైట్, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థలు హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై కోల్‌కత్తా, ముంబై, భువనేశ్వర్, తిరుపతి, ఇండోర్, కోచి, పూణె, రాయపూర్, పోర్టు బ్లెయిర్ తదితర నగరాలకు డొమెస్టిక్ సర్వీసులు నడుపుతున్నాయి. నవంబరు నెలాఖరు వరకు విశాఖపట్నం విమానాశ్రయానికి రోజుకు 28 విమానాలు వచ్చి, తిరిగి వెళ్లేవి. అంటే 56 సర్వీసులు అందుబాటులో ఉండేవి. ఇందులో ఇండిగో సంస్థ హైదరాబాద్‌కు-2, చెన్నై, కోల్‌కత్తా, ముంబై, భువనేశ్వర్, ఢిల్లీ, తిరుపతిలకు ఒక్కో విమానం నడుపుతోంది. ప్రస్తుతం ఇండిగో విమానాలు రోజుకు ఎనిమిది రద్దయిపోతున్నాయి. దాంతో కేవలం 21 విమానాలే డిసెంబరు 2వ తేదీ నుంచి తిరిగి వెళుతున్నాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. ఈ సంక్షోభం ముగిసి ఇండిగో సేవలు ఎప్పటి నుంచి పునరుద్ధరణ జరుగుతాయో తెలియదని విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి.