కొనసాగుతున్న చలి తీవ్రత
ABN , Publish Date - Nov 15 , 2025 | 10:56 PM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు దిగజారుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత కొనసాగుతున్నది.
అరకులోయలో 7 డిగ్రీలు నమోదు
చలికి వణుకుతున్న మన్యం వాసులు
పాడేరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు దిగజారుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత కొనసాగుతున్నది. దీంతో ఏజెన్సీ వాసులు గజగజలాడుతున్నారు. శనివారం అరకులోయలో 7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా డుంబ్రిగుడలో 7.6, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, హుకుంపేటలో 8.9, పెదబయలులో 10.3, చింతపల్లిలో 11.4, కొయ్యూరులో 13.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మన్యం వాసులు గజగజ
ఏజెన్సీలో గత నాలుగు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో మన్యం వాసులు వణుకుతున్నారు. వారం రోజులుగా ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టంగా పొగమంచు కురవడం, మధ్యాహ్నం వేళలో ఒకటి, రెండు గంటలు మాత్రమే గట్టిగా ఎండ కాస్తుండడంతో పగలు రాత్రుళ్లు తేడా లేకుండా చలి ప్రభావం చూపుతున్నది. దీంతో జనం ఉన్ని దుస్తులు ధరిస్తూ... చలి మంటలు కాగుతూ... చలి నుంచి రక్షణ పొందుతున్నారు. అయితే రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని స్థానికులు అంటున్నారు.