Share News

కనకమహాలక్ష్మి ఆలయంలో ఏకపక్ష ధోరణి

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:57 AM

కనకమహాలక్ష్మి దేవస్థానం అధికారులు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కనకమహాలక్ష్మి ఆలయంలో ఏకపక్ష ధోరణి

స్థానికులకు తగ్గిపోతున్న ప్రాధాన్యం

మార్గశిర మాసోత్సవం ముహూర్తపు రాటకు బురుజుపేట మహిళలను దూరంగా పెట్టిన వైనం

నిరసన వ్యక్తం చేయడంతో లోపలకు అనుమతి

విశాఖపట్నం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి):

కనకమహాలక్ష్మి దేవస్థానం అధికారులు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు అతి పెద్ద కార్యక్రమం. దీనికి శనివారం ముహూర్తపు రాట వేశారు. ఏటా ఈ కార్యక్రమంలో బురుజుపేటకు చెందిన స్థానిక మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని పసుపు రాసి పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అంతా అయిన తరువాత దేవస్థానం అధికారులు పసుపు, కుంకుమతో పాటు జాకెట్‌ ముక్కలు పెట్టి వారిని సత్కరిస్తారు. ఈసారి ఆలయ అధికారులు స్థానిక మహిళలను ఈ కార్యక్రమానికి దూరంగా పెట్టారు. కేవలం రాజకీయ నాయకులకే ప్రాధాన్యం ఇచ్చారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, ఇతర ప్రముఖులతో రాట పూజ చేయించారు. ఇందులో ముత్తయిదువుల కంటే పురుషులే పెద్ద సంఖ్యలో ఉండడం గమనార్హం. దీనిపై స్థానిక మహిళలు కొద్దిసేపు నిరసన వ్యక్తంచేయడంతో ఆ తరువాత వారిని లోపలకు అనుమతించారు. అమ్మవారి దర్శనాలు చేయించి జాకెట్‌ ముక్కలు పెట్టి పంపించారు.

ఈఓపై కలెక్టర్‌కే ఫిర్యాదు

ఆలయ ఈఓ శోభారాణిపై కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌కు 38వ వార్డు కార్పొరేటర్‌ గోడి విజయలక్ష్మి మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. కార్తీక మాసంలో అయ్యప్పస్వాములు మాలలు వేసుకుంటారని, అమ్మవారి సమక్షంలో మాలధారణ చేయడం ఆనవాయితీగా వస్తుంటే...దానికి ఈఓ అనుమతించడం లేదని ఆమె ఫిర్యాదు చేశారు. కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీని పక్కనపెట్టి మాలలు బయట వేసుకోవాలని చెబుతున్నారని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆమె కలెక్టర్‌ను కోరారు.


వచ్చే నెల 6న వన్డే

భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌

వేదికగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియం

విశాఖపట్నం, స్పోర్ట్స్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి):

మరో వన్డే మ్యాచ్‌కు విశాఖ ఆతిథ్యమివ్వనుంది. పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో వచ్చే నెల (డిసెంబరు) 6న భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈనెల 14 నుంచి వచ్చే నెల 19 వరకు భారత్‌తో పర్యటించనున్న దక్షిణాఫ్రికా జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌ రాంచీ, రెండో మ్యాచ్‌ రాయపూర్‌లో జరగనుండగా...డిసెంబరు 6న జరగనున్న మూడో వన్డేకు ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక కానుంది. ఇప్పటివరకూ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మూడు టెస్టులు, 10 వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్‌లు జరిగాయి. 11వ వన్డే మ్యాచ్‌ నిర్వహణకు ఏసీఏ ప్రతినిధులు సిద్ధమవుతున్నారు.

Updated Date - Nov 02 , 2025 | 12:57 AM