ఉలిక్కిపడ్డ వన్‌టౌన్
ABN , Publish Date - Aug 08 , 2025 | 01:02 AM
ఫిషింగ్ హార్బర్ సమీపంలోని బుక్కా వీధి వద్ద ఉన్న వెల్డింగ్ దుకాణంలో గురువారం సాయంత్రం పేలుడు సంభవించడంతో వన్‌టౌన్ ప్రాంతం ఉలిక్కిపడింది.
హార్బర్ సమీపంలోని వెల్డింగ్ దుకాణంలో పేలుడు
రెండు కిలోమీటర్లు పరిధి వరకూ వినిపించిన శబ్దం
ఏం జరిగిందో తెలియక ఆందోళనకు గురైన జనం
ముగ్గురి మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు
విశాఖపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి):
ఫిషింగ్ హార్బర్ సమీపంలోని బుక్కా వీధి వద్ద ఉన్న వెల్డింగ్ దుకాణంలో గురువారం సాయంత్రం పేలుడు సంభవించడంతో వన్‌టౌన్ ప్రాంతం ఉలిక్కిపడింది. ఈ ప్రమాదంలో దుకాణంలో పనిచేస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. దుకాణంలో పనిచేస్తున్న మరో ఇద్దరితోపాటు పక్కనే ఉన్న స్ర్కాప్ దుకాణం యజమాని తీవ్రంగా గాయపడ్డారు.
నగరంలో ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎక్కువమంది ఇళ్లలోనే ఉండిపోయారు. సాయంత్రం వాతావరణం కాస్త చల్లబడడంతో కొందరు శ్రావణ శుక్రవారం షాపింగ్ కోసం మార్కెట్‌కు వెళ్లేందుకు, మరికొందరు కుటుంబాలతో బీచ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతలో హార్బర్ వైపు నుంచి ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించడంతో ఆ పరిసర ప్రాంతాలవాసులు కంగారుపడ్డారు. ఏం జరిగిందో కొంతసేపు ఎవరికీ అర్థం కాలేదు. పరిసర ప్రాంతాల్లో ఉన్నవారంతా ఆందోళనతో అక్కడకు చేరుకునేసరికి రెండు మృతదేహాలు కనిపించాయి. మరో నలుగురు శరీరాలు పూర్తిగా కాలిపోయి, సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. కొంతసేపు ఎవరూ వారి సమీపంలోకి వెళ్లడానికి సాహసించలేకపోయారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి గాయాలతో రక్తమోడుతున్న వారిని ఆటోలో కేజీహెచ్‌కు తరలించారు. పేలుడు ధాటికి వెల్డింగ్ దుకాణంతోపాటు పక్కనే ఉన్న స్ర్కాప్ దుకాణం, మరో బడ్డీ నామరూపాల్లేకుండా పోయాయి. రోడ్డుపై ఎక్కడచూసినా దుకాణాల్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడు శబ్దం వన్‌టౌన్ హార్బర్ నుంచి కేజీహెచ్ వరకు, బుక్కావీధి నుంచి చెంగలరావుపేట, పూర్ణామార్కెట్ వరకూ వినిపించింది.
కాగా, పేలుడు జరిగిన ప్రాంతంలోకి వెళ్లేందుకు కొందరు ప్రయత్నించడంతో వన్‌టౌన్ సీఐ జీడీబాబు ప్రత్యేక సిబ్బందిని నియమించి నియంత్రించారు. అగ్నిమాపక సిబ్బంది పేలుడు జరిగిన ప్రాంతంలో ఇంకా ఏమైనా సిలిండర్లు పేలే అవకాశం ఉందేమోనని పరిశీలించారు. వెల్డింగ్ దుకాణంలో మూడు ఎల్‌పీజీ సిలిండర్లతోపాటు రెండు ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. ఇంకేమైనా పేలుడుకు కారణమైందా? అనే కోణంలో పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తుచేస్తున్నారు.
ప్రమాదానికి కారణాలపై విచారణ: కలెక్టర్
హార్బర్ సమీపంలోని వెల్డింగ్ దుకాణంలో పేలుడుకు కారణం ఏమిటనేదానిపై సమగ్ర విచారణ జరుపుతామని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్ అన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌తో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేలుడుకు గ్యాస్ సిలిండర్ కారణం కారణమని ప్రాథమిక విచారణలో కొందరు చెబుతున్నారన్నారు. అసలు సిలిండర్‌ను దేనికి ఉపయోగిస్తున్నారు, ఎందుకు పేలిందనేది తెలియాల్సి ఉందన్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందినవారితోపాటు గాయపడిన వారిలో ఇద్దరు అదే దుకాణంలో నిత్యం పనిచేస్తున్నవారేనన్నారు. మరొకరు మాత్రం పక్కనే ఉన్న స్ర్కాప్ దుకాణం యజమాని అని తెలిసిందన్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్ మాట్లాడుతూ పేలుడులో గాయపడి కేజీహెచ్‌లో చికిత్సపొందుతున్నవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించామన్నారు. అవసరమైతే వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
చాలా బాధాకరం
వాసుపల్లి రాజ్‌కుమార్, బుక్కావారి వీధి
సుమారు ఎనిమిది నెలల క్రితం గణేష్‌కుమార్ వెల్డింగ్ షాపులో పనికి చేరాను. గురువారం ఉదయం వచ్చాను. మధ్యాహ్నం నుంచి జ్వరం వచ్చినట్టు నలతగా ఉండడంతో రెండు గంటల సమయంలో పర్మిషన్ అడిగి ఇంటికి వెళ్లిపోయాను. ప్రమాదంలో యజమాని, నాతోటి ఉద్యోగులు మరణించడం చాలా బాధాకరం. గణేష్ చాలా బాగా చూసుకొనేవారు.
ఏం జరిగిందో కాసేపు అర్థం కాలేదు
నిజాముద్దీన్, స్థానికుడు గణేషు మిత్రుడు
నేను నా వాహనం మీద వస్తూ షాపునకు సమీపంలో ఉండగానే భారీపేలుడు సంభవించింది. ఏం జరిగిందని చూసేలోపు బాధితులు బయటకు వచ్చి హాహకారాలు చేసున్నారు. శరీర విడిభాగాలు కనిపించడంతో ఎంత మంది చనిపోయారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. సమీపంలోని ఒక షాపులో నిత్యం పది మందికి పైగా మద్యం సేవిస్తూ ఉంటారు. ఆ సమయంలో అది మూసి ఉండడంతో ప్రాణ నష్టం తగ్గింది.