చెరువులో జారిపడి ఒకరి మృతి
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:19 AM
మండలంలోని నారపాడులో ఓ వ్యక్తి చెరువులో జారిపడి మృతిచెందాడు.
సబ్బవరం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నారపాడులో ఓ వ్యక్తి చెరువులో జారిపడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నారపాడు గ్రామానికి చెందిన నరవ అప్పలరాజు(45) కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం గ్రామానికి సమీపంలోని చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. నిండుగా నీరు ఉండడంతోపాటు అప్పలరాజుకు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఈ సమయంలో అటుగా వెళుతున్న పల్లా గణేశ్ చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సహకారంతో చీకటిపడే వరకు చెరువులో గాలించినా ఆచూకీ లభించడంలేదు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం ఉదయం పోలీసులు వచ్చి చెరువులో వెతగ్గా కొద్దిసేపటికి అప్పలరాజు మృతదేహం నీటిలో తేలింది. ఒడ్డుకు చేర్చి, పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. భార్య దేవి సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ జి.రామచంద్రరావు తెలిపారు.