త్వరలో శత శాతం వరినాట్లు పూర్తి
ABN , Publish Date - Aug 23 , 2025 | 11:32 PM
జిల్లాలో ఇంతవరకు రైతులు 30 శాతం వరినాట్లు వేశారని, మరో వారం పది రోజుల్లో నూరు శాతం పూర్తవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ ప్రతినిధి కె.శ్రీధర్ తెలిపారు.
యూరియా తదితర ఎరువుల సక్రమ పంపిణీకి చర్యలు
జిల్లా వ్యవసాయ సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రతినిధి శ్రీధర్
అనకాపల్లి అగ్రికల్చర్, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఇంతవరకు రైతులు 30 శాతం వరినాట్లు వేశారని, మరో వారం పది రోజుల్లో నూరు శాతం పూర్తవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ ప్రతినిధి కె.శ్రీధర్ తెలిపారు. ఇక్కడి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో శనివారం ఏడీఆర్ డాక్టర్ శ్రీలత అధ్యక్షతన జరిగిన జిల్లా వ్యవసాయ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా తదితర ఎరువుల సక్రమ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జీవన ఎరువులు, నానో ఎరువుల వినియోగం పట్ల రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ప్రకృతి వ్యవసాయం డీపీఎంసీహెచ్ లచ్చన్న మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయం చేపడితో ఆరోగ్యకరమైన ఉత్పత్తులను సాఽధించ వచ్చునన్నారు. ఈ లక్ష్యంతోనే ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుందని వివరించారు. ఈ నెల రెండో వారంలో కురిసిన వర్షాల వలన ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా మారిందని తెలిపారు. ఈ నెలలో ఇంతవరకు 54శాతం అధిక వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ కేవీ రమణమూర్తి, డాక్టర్ విశాలాక్షి, డాక్టర్ ఉమామహేశ్వరరావు, వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.