నూరు శాతం అక్షరాస్యత
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:20 AM
రాబోయే మూడేళ్లలో 100 శాతం అఽక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చూడాలనుకుంటున్నానని గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు.
రాబోయే మూడేళ్లలో సాధించాలని గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆకాంక్ష
శరవేగంగా ఏవియేషన్ రంగం అభివృద్ధి
ప్రపంచానికి నిపుణులను అందించనున్న ఏరో సిటీ
ప్రపంచంలో యంగెస్ట్ కంట్రీ భారత్
పోలవరం ప్రాజెక్టును భారతదేశం చూస్తుందనే నమ్మకం ఇప్పుడు కలుగుతోంది
విశాఖపట్నం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి):
రాబోయే మూడేళ్లలో 100 శాతం అఽక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చూడాలనుకుంటున్నానని గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. ఏవియేషన్ ఎడ్యుసిటీకి మాన్సాస్ ట్రస్ట్ నుంచి ఉచితంగా భూములు ఇచ్చిన సందర్భంగా విశాఖలో మంగళవారం నిర్వహించిన ఎంఓయూ సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం 14 లక్షల మంది పిల్లలను బడికి దూరం చేసిందని, అది చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తంచేశారు. వంద శాతం అక్షరాస్యత సాధించిన గోవా రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్నానని, సొంత రాష్ట్రం ఏపీ కూడా అలాంటి పేరు సాధించాలని, విద్యా శాఖా మంత్రి లోకేశ్ దానిని మూడేళ్లలో సాధిస్తారని విశ్వసిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో యంగెస్ట్ దేశమని అభివర్ణించారు. దేశంలో ఏవియేషన్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
పోలవరం ప్రాజెక్టు గురించి ఎప్పటి నుంచో వింటున్నానని, తలపై జుట్టు తెల్లబడింది కానీ అది సాకారం కాలేదన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, ఇప్పుడు మళ్లీ దానిపై ఆశలు చిగురిస్తున్నాయని, పోలవరం ప్రాజెక్టును భారతదేశం చూస్తుందనే నమ్మకం కలిగిందన్నారు. ఎంతో వెనుకబడిన ప్రాంతంలో జన్మించిన అల్లూరి సీతారామరాజు పేరును ఇప్పుడు అదే ప్రాంతంలో నిర్మిస్తున్న అధునాతన అంతర్జాతీయ విమానాశ్రయానికి పెడుతున్నారంటే అంతకంటే అభివృద్ధి ఏముంటుందని ప్రశ్నించారు. ఇది ఉత్తరాంధ్ర భావితరాలకు సందేశంగా నిలుస్తుందన్నారు. విజయనగరం పూసపాటి రాజుల కుటుంబం నుంచి ఏవియేషన్ రంగంలోకి వెళ్లిన అలక్ నారాయణ్ పైలట్‌గా పనిచేశారని, ఆయన పేరుతోనే మాన్సాస్ విద్యా సంస్థల ట్రస్ట్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇంతకు ముందు చంద్రబాబునాయుడు, ఎర్రన్నాయుడు, తాను కలిసి టీమ్ వర్క్‌తో పనిచేశామని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఆ బాధ్యతలను లోకేశ్, రామ్మోహన్‌నాయుడు, అదితిలకు అప్పగించామన్నారు. ఎడ్యుసిటీ ప్రపంచానికి నిపుణులను అందిస్తుందని, వారంతా మాతృదేశం గురించి అక్కడ గొప్పగా చెప్పాలని, ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా...పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అంటూ గేయం ఆలపించి అందరినీ ఉద్వేగభరితులను చేశారు.
ఉత్తరాంధ్రకు మహర్దశ
ఇన్ని సంస్థలు వస్తాయని ఎప్పుడూ ఊహించలేదు
ఈ ప్రాంత అభివృద్ధికి నాడు ఎన్‌టీఆర్, ఆ తరువాత చంద్రబాబునాయుడు, ఇప్పుడు లోకేశ్ కృషి
అభివృద్ధికి అన్ని పార్టీలు సహకరించాలి
స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
విశాఖపట్నం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి):
‘ఉత్తరాంధ్రాకు అన్యాయం జరుగుతోంది అంటూ చాలామంది చాలాకాలంగా చెబుతున్నారు. 1983లో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇదే మాట. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టింది.’...అని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖపట్నం రాడిసన్ బ్లూ హోటల్‌లో మంగళవారం ‘జీఎంఆర్-మాన్సాస్ ట్రస్ట్’ల మధ్య జరిగిన ఏవియేషన్ ఎడ్యుసిటీ ఒప్పంద సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంతం ఇంతగా అభివృద్ధి చెందుతుందని, ఇన్ని సంస్థలు వస్తాయని తాము ఎప్పుడూ ఊహించలేదన్నారు. వీటివల్ల రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. నాడు ఎన్‌టీఆర్, ఆ తరువాత చంద్రబాబునాయుడు, ఇప్పుడు లోకేశ్ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఇలాంటి మంచి పనులకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి రావాలని అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. అభివృద్ధి పనులకు కూడా ఆటంకాలు సృష్టిస్తున్నారని, అది తగదన్నారు. పది వేల రూపాయలు విరాళం ఇస్తే లక్ష రూపాయలు ఖర్చుతో ప్రచారం చేసుకునే మనుషులు ఉన్న ఈ దేశంలో వేలాది ఎకరాల భూములు విద్యాభివృద్ధికి ఉచితంగా ఇచ్చిన పూసపాటి రాజ వంశీయులు అశోక్‌గజపతిరాజు, ఆయన కుమార్తె అదితి...చాలా సింపుల్‌గా జీవిస్తారని అయ్యన్నపాత్రుడు వివరించారు. గతంలో ఆయన హైదరాబాద్‌కు తమతో పాటు గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలులోనే వచ్చేవారని, ఆయనకు చిన్న నానో కారు ఉందని, దానిని ఆయనే తుడుచుకుంటారని, అది ఆయన గొప్పతనమని అశోక్‌గజపతి సింప్లిసిటీని అయ్యన్న వివరించారు.
సిటీలో మౌలిక వసతులు పెంపొందిస్తాం
త్వరలో ఏయూలో పోస్టుల భర్తీ
రూసా నిధులు తెచ్చుకుంటాం
గతంలో లోపాలపై కమిటీ ఇంకా నివేదిక ఇవ్వలేదు
ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్
విశాఖపట్నం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి):
నగరంలో మౌలిక వసతులు పెంపొందిస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల ప్రకారం రెండు నెలలకు ఒకసారి దీనిపై సమావేశాలు నిర్వహించి, దశల వారీగా అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. మంగళవారం హోటల్ రాడీసన్ బ్లూలో జీఎంఆర్-మాన్సాస్ సంస్థల మధ్య జరిగిన ఎంఓయూ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పోస్టుల భర్తీకి త్వరలో రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఏయూలో అనేక సమస్యలు ఉన్నాయని ఒకరు ప్రస్తావించగా, వాటిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. న్యాయపరమైన అడ్డంకుల వల్ల పోస్టుల భర్తీ నిలిచిపోయిందని, త్వరలోనే రిక్రూట్‌మెంట్ చేపడతామన్నారు. రూసా నిధులు రూ.200 కోట్లు వినియోగించుకోకపోవడం వల్ల మురిగిపోయాయని, కేంద్రంతో మాట్లాడి వాటిని వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏయూలో గతంలో జరిగిన అవకతవకలపై విచారణకు కమిటీని వేశామని, వారు ఇంకా నివేదిక ఇవ్వలేదని, ఆ నివేదిక వచ్చాక తగిన చర్యలు చేపడతామన్నారు. ఫార్మా కంపెనీల బస్సులను సిటీలోకి అనుమతించడం లేదనే అంశంపై మాట్లాడుతూ, ఆయా కంపెనీలతో తాను మాట్లాడతానన్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ, భోగాపురంలో ఏర్పాటుచేసే ఏవియేషన్ ఎడ్యుసిటీలో కేంద్ర పౌర విమానయాన శాఖ తరపున కొన్ని అంశాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేసే ఆలోచన ఉందన్నారు. నేవిగేషన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఫ్లైట్ ఆపరేషన్లు వంటి అంశాల్లో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డీజీసీఏ వంటివి చర్యలు చేపడతాయన్నారు. విమానాలకు మరమ్మతులు, ఓవర్ హాలింగ్, నిర్వహణ వంటివి చేపట్టడానికి విమానాశ్రయం పక్కనే 500 ఎకరాల్లో ఎంఆర్‌ఓను జీఎంఆర్ ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రస్తుతం జీఎంఆర్ హైదరాబాద్‌లో ఎంఆర్‌ఓ నిర్వహిస్తోందని, దానికి దీటుగా ఇక్కడ వసతులు ఉంటాయన్నారు. సౌత్ ఈస్ట్ ఆసియాతో పాటు గల్ఫ్ దేశాలకు చెందిన విమానాలకు కూడా ఇక్కడ నిర్వహణ పనులు జరుగుతాయన్నారు.