శతశాతం ధ్యేయం
ABN , Publish Date - Dec 02 , 2025 | 01:13 AM
దేశంలో ప్రతిఒక్కరూ అక్షరాస్యులు కావాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
సంపూర్ణ అక్షరాస్యత దిశగా కార్యాచరణ
2029 నాటికి సాధించడమే లక్ష్యం
2011 జనాభా లెక్కల మేరకు 66.91 శాతం అక్షరాస్యత
ఉమ్మడి జిల్లాలో మొత్తం నిరక్షరాస్యులు : ఆరు లక్షలు
తొలివిడతలో 2.53 లక్షల మందిని తీర్చిదిద్దాలని కంకణం
విశాఖపట్నం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి):
దేశంలో ప్రతిఒక్కరూ అక్షరాస్యులు కావాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ఆర్థిక సంవత్సరం నుంచి 2026-27 వరకు మూడేళ్లలో నిరక్షరాస్యుల్లో మూడింట ఒక వంతు మందిని అక్షరాస్యులుగా మార్చాలన్నది లక్ష్యం. ఇందులో భాగంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేసిన అధికారులు, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో నిరక్షరాస్యులకు చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు నేర్పించేందుకు తరగతులు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో 2011 జనాభా లెక్కల మేరకు అక్షరాస్యత 66.91 శాతం (పురుషులు 74.56, మహిళలు 59.34 శాతం)గా నమోదయింది. కొత్త జిల్లాల వారీగా చూస్తే విశాఖ జిల్లాలో పురుషులు, మహిళలు 84.81 శాతం, 73.21 శాతం (మొత్తం 79.05 శాతం), అనకాపల్లిలో 68.90, 52.43 (మొత్తం 60.55 శాతం), అల్లూరి జిల్లాలో 57.60, 39.53 (48.34 శాతం) అక్షరాస్యులున్నారు. ఆ తరువాత కాలంలో అక్షరాస్యత శాతం పెరిగింది. పదేళ్ల క్రితం సంక్షేమ కార్యక్రమాల అమలుకోసం చేపట్టిన సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాలో సుమారు ఆరు లక్షల మంది నిరక్షరాస్యులు ఉంటారని అంచనా వేశారు. ఇందులో తొలివిడతలో మొత్తం 2,53,915 మంది (విశాఖ జిల్లాలో 78,676 మంది, అనకాపల్లిలో 89,944, అల్లూరి జిల్లాలో 85,284)ని అక్షరాస్యులను చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ప్రధానంగా ఉపాధి హామీ పథకం కూలీలు, డ్వాక్రా సంఘాల సభ్యులను అక్షరాస్యులను చేయడం ద్వారా ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టిసారించారు. దీనికి అనుగుణంగా అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆడియో, వీడియో పాఠాలతోపాటు రాయడం, చదవడం, చిన్నచిన్న కూడికలు, తీసివేతలు నేర్పిస్తున్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రాథమిక అక్షరాస్యత, సాంఖ్యక శాస్త్రం, జీవ, వృత్తి నైపుణ్యాలు, ప్రాథమిక విద్య, నిరంతర విద్య కార్యక్రమాలు అమలుచేస్తారు.
అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో నిరక్ష్యరాస్యులకు ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయి. త్వరలో విశాఖ జిల్లాలోనూ నిర్వహిస్తామని జిల్లా వయోజన విద్యా ఉప సంచాలకుడు ఎస్.సుబ్రహ్మణ్యం తెలిపారు. అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో నిరక్షరాస్యులకు వచ్చే ఏడాది మార్చిలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ చదవడం, రాయడం, చిన్నపాటి కూడికలు, తీసివేతలు, సంతకం నేర్పుతున్నామన్నారు. ఒక వాచకం కూడా అందజేశామన్నారు.