Share News

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:00 PM

పాడేరు-విశాఖ ప్రధాన రహదారిలో మినుములూరు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
కారు ప్రమాదంలో మృతి చెందిన వెంకటరత్నం నాయుడు

పాడేరురూరల్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): పాడేరు-విశాఖ ప్రధాన రహదారిలో మినుములూరు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, ఎస్‌ఐ సూర్యనారాయణ అందించిన వివరాలిలా ఉన్నాయి.

మైదాన ప్రాంతం నుంచి పాడేరు వస్తున్న కారు మినుములూరు వద్దకు వచ్చేసరికి ఆటోని ఢీకొంది. దీంతో ఆటో పక్కనే ఉన్న ఇంటిలోకి దూసుకుపోవడంతో రమణ(35) గాయపడ్డాడు. అదే సమయంలో కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో వాహనదారుడు జల్లి వెంకట రత్నం నాయుడు(65) కింద పడి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్‌ అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఎస్‌ఐ సూర్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన రమణ పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందారు. మృతుడు ఎం.కోడూరు గ్రామానికి చెందిన వెంకటరత్నంనాయుడు ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కారుడ్రైవర్‌ కుండల నవీన్‌ కుమార్‌(23)ను అరెస్టు చేశామని, ఈయనది కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని ఎస్‌ఐ సూర్యనారాయణ తెలిపారు.

Updated Date - Apr 11 , 2025 | 11:00 PM