వన్డే వార్
ABN , Publish Date - Dec 06 , 2025 | 01:14 AM
పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం జరగనున్న అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది.
నేడే భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్
కీలక సమరానికి సిద్ధమైన ఏసీఏ-వీడీసీఏ స్టేడియం
అందరిదృష్టి విరాట్ కోహ్లి, రోహిత్‌శర్మలపైనే...
మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్
విశాఖపట్నం స్పోర్ట్స్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి):
పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం జరగనున్న అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్ కీలకంగా మారింది. గెలుపు కోసం ఇరుజట్ల సారథులు వ్యూహ ప్రతి వ్యూహాలతో సన్నద్ధమవుతున్నారు.
అందరి దృష్టి విరాట్, రోహిత్ శర్మలపైనే..
క్రీడాభిమానుల దృష్టి అంతా విరాట్ కోహ్లి, రోహిత్‌శర్మలపైనే ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌లలో సెంచరీలతో చెలరేగిన కోహ్లి...ఈ మ్యాచ్‌లో కూడా సెంచరీ సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటివరకూ ఇక్కడ జరిగిన వన్డేల్లో కోహ్లి మూడు సెంచరీలు చేశాడు. ఇక ఇక్కడి పిచ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రికార్డు రోహిత్‌శర్మ పేరిట ఉంది. దీంతో అతను కూడా రాణించే అవకాశాలు ఉన్నాయని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా విరాట్, రోహిత్‌లకు విశాఖలో ఇదే చివరి మ్యాచ్‌గా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
నో సీటు నంబర్ విధానం
ఈ మ్యాచ్‌కు సీటు నంబరింగ్ విధానం అమలు చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ మాదిరిగా ముందు వచ్చినవారు తమకు ఇష్టమైన సీట్లలో కూర్చునే విధానాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో ప్రేక్షకులలో ఆందోళన నెలకొంది. మ్యాచ్‌కు కనీసం రెండు గంటల ముందుగా స్టేడియంలోకి వెళ్లకపోతే ముందు సీట్ల లభించవని భావిస్తున్నారు. ఈ విధానంతో సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది.
ఇరుజట్ల సాధన
ఇరుజట్లు శుక్రవారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో సాధన చేశాయి. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాధన చేయగా, భారత్ ఆటగాళ్లు సాయంత్రం నెట్ ప్రాక్టీస్ చేశారు.
లోకల్ బాయ్ నితీష్‌కు చాన్స్ దక్కేనా?
ఈ మ్యాచ్‌లో లోకల్ బాయ్ నితీష్‌కుమార్‌రెడ్డికి తుది జట్టులో స్థానం దక్కుతుందో లేదో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. రాంచీ, రాయ్‌పూర్‌లో జరిగిన రెండు వన్డేలలో నితీష్‌కుమార్‌రెడ్డి బెంచ్‌కే పరిమితమయ్యాడు. రాంయీలో జరిగిన తొలి వన్డేలో మిడిల్ ఆర్డర్‌లో రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్ విఫలం కావడంతో రెండో వన్డేలో నితీష్ తుది జట్టులో చేరతాడని క్రీడాభిమానులు ఆశించారు. అయితే రెండో వన్డేలో కూడా నితీష్‌కుమార్‌రెడ్డిని బెంచ్‌కే పరిమితం చేశారు. రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో చెలరేగి తన స్థానాన్ని పదిలం చేసుకోగా, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ రనౌటై నిరాశపరిచాడు. దీంతో మూడో వన్డేకు వాషింగ్టన్ సుందర్ స్థానంలో మరొక ఆల్‌రౌండర్‌ను తీసుకోవాల్సి వస్తే నితీష్‌కుమార్‌రెడ్డికి చోటు దక్కే అవకాశాలున్నాయని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.